
అంబాజీపేట: సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రామచంద్రపురం క్యాంపు కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా సత్తెనాపల్లికి చెందిన 100 మంది టీడీపీ నాయకులు శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు.
ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు కొండవీటి దత్తాత్రేయులు, ప్రగతి కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మక్కిన అచ్చయ్యదొరతో పాటు మరో 98 మంది పార్టీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ అధినేత కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాలుగేళ్ల పాలన అవినీతి మయంగా మారిందన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ దొరికినకాడికి దోచుకున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందన్నారు.
టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉన్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు అన్నారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి సురేష్, కె.గంగవరం మండలం అద్దంపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి సురేష్, గుత్తుల రాధిక కూడా పార్టీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.