తమ్ముళ్ల పైరవీలు | TDP Leaders Lobbying for Ministers posts | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల పైరవీలు

Published Mon, Jun 16 2014 1:08 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

తమ్ముళ్ల పైరవీలు - Sakshi

తమ్ముళ్ల పైరవీలు

సాక్షి, కాకినాడ :పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టడంతో తెలుగు తమ్ముళ్లు పదవులను అందుకోవడానికి అర్రులు చాస్తున్నారు. ఒకపక్క ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎమ్మెల్యేలు కర్ర పెత్తనం చేస్తుంటే.. మరోపక్క ప్రభుత్వం ఇంకా కుదుటపడకుండానే పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు పైరవీలు మొదలుపెట్టారు. కొన్ని కీలక పదవుల కోసం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కూడా స్థానిక‘దేశం’ నేతలకు ముట్టజెప్పేందుకు సైతం వెనుకాడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలకమండళ్లు, ఇతరత్రా నియామక పదవులను రద్దు చేసేందుకు తెలుగుదేశం సర్కార్ రంగం సిద్ధం చేసింది..
 
  సాధారణంగా ప్రభుత్వం మారిన సయయాల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా తక్షణమే పదవులకు రాజీనాలు చేయాలి. రాష్ర్టంలో ప్రభుత్వం మారి దాదాపు నెలైంది. వాస్తవానికి మార్చిలో రాష్ర్టపతి పాలన అమల్లోకి  వచ్చింది. అంటే అప్పుడే ఈ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా తప్పుకోవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఆయా పదవుల్లో కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో నియమితులైన వారే నేటికీ కొనసాగుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ర్ట తొలి కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలకమండళ్లు, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిని రద్దుచేయాలని నిర్ణయించారు.
 
 అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చయినా వీరిని తొలగించాలని నాటి సమావేశంలో తీర్మానించారు. వ్యవసాయ, మార్కెటింగ్, దేవాదాయ, పౌరసరఫరాల శాఖల్లోనే ఎక్కువగా రాష్ర్ట స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నామినేటెడ్ పదవులుంటాయి. ఇవికాకుండా వివిధ బ్యాంకులు, కార్పొరేషన్లకు సంబంధించి డెరైక్టర్ల పదవులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చివరి రోజుల్లో నామినేటెడ్ పదవుల పందారంలో రాష్ర్ట హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పంతం నానాజీ, బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా డోకల మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అల్లు బాబిలతో పాటు  వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమించారు. జిల్లాలో వెయ్యికి పైగా దేవాలయాలున్నాయి. వీటిలో వార్షికాదాయం 2లక్షల నుంచి రూ.5లక్షల ఆదాయం ఉన్న సీ గ్రేడ్ దేవాలయాలు 457 ఉన్నాయి.
 
 రూ.5లక్షల నుంచి 25లక్షల వరకు ఉన్న బీ గ్రేడ్ ఆలయాలు 185, 25 లక్షల ఆదాయం పైబడి ఉన్న ఏ గ్రేడ్ ఆలయాలు 21 వరకు ఉన్నాయి. 2లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఆలయాలు సుమారు 350 వరకు ఉన్నాయి. ఏ, బీ గ్రేడ్ ఆలయాలకు ఐదుగురు నుంచి ఏడుగురు వరకు, సీ, డీ గ్రేడ్ ఆలయాలకు నలుగురు ట్రస్టీలు ఉంటారు. జిల్లాలో కీలక దేవస్థానాలతో పాటు సుమారు ఐదువందలకు పైగా దేవాలయాలకు పాలకవర్గాలున్నాయి. మరో నాలుగు వందలకు పైగా దేవాలయాల పాలకవర్గాల కాలపరిమితి  ఇటీవలే ముగిసింది. జిల్లాలో 20కు పైగా మార్కెటింగ్ కమిటీలుండగా, 16 కమిటీలకు పాలకవర్గాలున్నాయి. సివిల్ సప్లయిస్‌లో ఆహార సలహా సంఘాలు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్నాయి. రాష్ర్ట స్థాయి కార్పొరేషన్  పదవుల్లో ఉన్న వారితో పాటు జిల్లా, గ్రామస్థాయి వరకు పదవుల్లో ఉన్నవారు సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. మార్కెటింగ్ కమిటీ పాలక వర్గాలు కూడా ఇదే బాటలో రాజీనామాలు చేయాల్సి ఉంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులన్నీ రద్దు కానున్నాయి.
 
 పదేళ్లుగా పదవులకు దూరంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ర్ట స్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కీలకమైన నేతలంతా ప్రయత్నాలు ఆరంభించారు. మరొక పక్క జిల్లా పరిధిలో ఉండే నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దేవాదాయ, మార్కెటింగ్ శాఖల్లో  కీలకమైన పదవుల కోసం రూ.2లక్షల నుంచి 5లక్షల వరకు ముట్టచెప్పేందుకు సైతం తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. అన్నవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అంతర్వేది, అయినవిల్లి, మురమళ్ల, తలుపులమ్మలోవ, అప్పనపల్లి, ర్యాలీ, గొల్లల మామిడాడ, వాడపల్లిలతో పాటు కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలోని పలు దేవాలయాల పాలక మండళ్లలో స్థానం కోసం తెలుగుతమ్ముళ్లు పైరవీలు సాగిస్తున్నారు. మరోపక్క మార్కెటింగ్ కమిటీ పదవుల కోసం పావులు కదుపుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement