గోబెల్స్‌కే ‘బాబు’ల్లా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో టీడీపీ నేతల వ్యవహార శైలి బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టే చందంగా ఉంటోంది. ప్రజా సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చలకు వేదికగా ఉండాల్సిన శాసనసభను.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన బంధువులు, వైఎస్సార్‌సీపీ నేతలపై అసత్య ప్రచారానికి అధికార పక్షం వాడుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న ఆరోపణలు నరం లేని నాలుక ఎలాగైనా తిరుగుతుందనే చందంగా ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ట గ్రామంలో భూముల కొనుగోలు, నరసింహారెడ్డి అనే వ్యక్తి హత్య కేసు విషయాల్లో.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఎక్కడైనా వ్యక్తి హత్యకు గురైతే కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం పోలీసు విభాగం విధి. ప్రకాశం జిల్లాలో నరసింహారెడ్డి అనే వ్యక్తి గత నెల 23నో 24నో హత్యకు గురైతే పోలీసులతో విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. తర్వాత దోషులెవరనేది కోర్టు నిర్ధారిస్తుంది. దీనిని ఎవరూ కాదనరు. అలా కాకుండా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వీరప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి.. ఈ హత్యకు కారణమంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ అధినేత ఎలా వ్యాఖ్యానిస్తారు? ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే ఆ ప్రభావం కేసు విచారణపై పడదా? అనే విచక్షణ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఉండాలి. అది మచ్చుకైనా ప్రస్తుత పాలకపక్షంలోని వారికి లేదనడానికి వారి వ్యాఖ్యలే నిదర్శనం. కరువు, హుద్ హుద్ సాయంలో అక్రమాలు తదితరాలు చర్చకు వస్తే టీడీపీ అవినీతి బయటపడుతుందనే.. వాటిని చర్చకు రానీకుండా ఇలా ఓ వ్యక్తిగత హత్యను రాజకీయాలకు ముడిపెట్టి రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్నది టీడీపీ హయాంలోనే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోదరుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మామ గండ్లూరి వీరప్రతాప్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ప్రకాశం జిల్లా కొనకనమిట్ట గ్రామంలో భూములు కొనుగోలు చేశారు. వ్యాపారవేత్త అయిన వీరప్రతాప్‌రెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీ తర్వాతే అక్కడ భూములు కొన్నారు. ఈ ఏడాది జనవరి వరకు ఆయన భూములు కొన్నట్లు వారి సంబంధీకులు ఆధారాలు కూడా చూపుతున్నారు. అప్పటికే టీడీపీ అధికారంలోకి రావడమే కాకుండా.. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని అప్పటికే ప్రకటనలు వచ్చాయి. అంటే విజయవాడ పరిసరాల్లో రాజధాని వస్తుందని తెలిసిన తర్వాతే ఈ భూముల కొనుగోలు లావాదేవీలు జరిగాయి.
దొనకొండలో రాజధాని ఏర్పాటు చేద్దామనే దురుద్దేశంతోనే భూములు కొనుగోలు చేసినట్లు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనడానికి ఇది నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. భూములు అమ్మడానికి నిరాకరించినందున నరసింహారెడ్డి హత్యకు గురయ్యారంటూ పాలక పక్ష నేతలు చట్టసభలో ఆరోపించడం ఏమాత్రం సబబు కాదు. విచారణ జరి పించి దోషులకు శిక్ష పడేలా చూడాల్సిన పాలక పక్ష నేతలు విచారణను ప్రభావితం చేసేలా ఆరోపణలు గుప్పించడాన్ని బట్టే వారి కుటిల నీతి ఏమిటో అర్థమవుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.
బంధువులకు ఏమిటి సంబంధం?
వీరప్రతాప్‌రెడ్డికి ఎన్నో వ్యాపారాలున్నాయి. అయన, ఆయన బంధువులు భూములు కొనుగోలు చేశారు. ఇదెలా తప్పవుతుంది? అసలు నరసింహారెడ్డిది హత్యా..? కాదా? ఒక వేళ హత్య అయితే ఎందుకు జరిగిందో? ఎవరు చేశారో తేలకముందే ఒక పారిశ్రామికవేత్తపై అసెంబ్లీ సాక్షిగా అభియోగాలు మోపడం రాజకీయ కక్షసాధింపు కాదా? కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వీరప్రతాప్‌రెడ్డి మామ కావడంవల్లే టీడీపీ ఇలా హత్య కేసును ఆపాదిస్తోందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అవినాష్‌రెడ్డి బంధువు, అవినాష్‌రెడ్డికి వీరప్రతాప్‌రెడ్డి బంధువు. ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన నరసింహారెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి బంధువని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మరి వైవీ సుబ్బారెడ్డి కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బంధువే కదా. మరలాంటప్పుడు నరసింహారెడ్డి మరణంతో బంధుగణానికి ఉన్న సంబంధం ఏమిటి? నిజానిజాలు తేలకముందే బంధువులకు హత్యను అంటగట్టడం టీడీపీ నైజమా? అని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాగైతే బాబు పాత్ర ఉన్నట్లేగా?
టీడీపీ నేతల మాటల ప్రకారం చూస్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని తన నివాసంలో సినీ నటుడు బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసులో ఆయన బంధువైన చంద్రబాబు, అలాగే భువనేశ్వరి, లోకేష్‌ల పాత్ర ఉన్నట్లేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘2004లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ తన నివాసంలో కాల్పు లు జరిపినట్లుగా కేసు నమోదైంది. ఈ కాల్పు ల్లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి గాయపడ్డారు. దీంతో బాలకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ కేసు విషయంలో చంద్రబాబుపైనగానీ, ఆయన కుటుం బసభ్యులపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పట్లో ఈ కేసును విచారించిన పోలీసు అధికారి ప్రస్తుతం బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారు.
ఈ కేసు విషయంలో మేమెప్పుడైనా నందమూరి కుటుంబసభ్యులపై గానీ, చంద్రబాబుపైగానీ ఆరోపణలు చేశామా? ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా కుటుంబాలను రచ్చకీడ్చడం మా నైజం కాదు. టీడీపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా రాజ కీయ స్వార్థంతో అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనడానికి ఇవీ నిదర్శనాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వీటికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీరప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు
‘నరసింహారెడ్డి హత్యకు గురైనట్లు చెబుతున్న రోజు వీరప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. నగరంలోని ఒక హో టల్‌లో తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలను వీరప్రతాప్‌రెడ్డి దగ్గరుండి జరిపిం చారు. అయినా ఆయనే హత్య చేశారని టీడీపీ నేతలు అనడం దారుణం..’ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.