
బొత్సను వదలని టీడీపీ నేతలు
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ నేతలు వదలడం లేదు. బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి టార్గెట్ రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ నేతలు వదలడం లేదు. బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి టార్గెట్ రాజకీయాలు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు తాజాగా లిక్కర్ కేసును తిరగదోడేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బొత్స లిక్కర్ కేసును తిరగదోడే విషయాన్ని ప్రస్తావించారు. బొత్స, ఆయన సోదరుడ్ని తప్పిస్తూ గతంలో విచారణ జరిగిందని, తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని, వాటి ఆధారంగా మరోసారి విచారణ జరుపుతామని రామకృష్ణుడు సూచన ప్రాయంగా వెల్లడించారు.
తమ వాదలనకు బలం చేకూరే విధంగా జిల్లా నేతల నుంచి బొత్స మద్యం వ్యాపారం వివరాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా నేతలు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, శోభా హైమావతి తదితరులు బొత్స మద్యం వ్యాపార వివరాలన్ని సేకరించి నివేదిక రూపంలో సిద్ధం చేశారు . దాన్ని మంగళవారం సాయంత్రం 4.30గంటలకు హైదరాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్ర సమావేశంలో చంద్రబాబుకు నివేదికను సమర్పించనున్నారు. ఈలోపే బొత్స లిక్కర్ బిజినెస్ నివేదిక కాపీని సీఎం ఓఎస్‌డీకి మెయిల్ ద్వారా కూడా పంపించారు.