
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో వారిని నేరుగా కలిసివారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా పాజిటివ్‌గా తేలిన జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆయన ఇటీవల కలవడంతో వైద్యుల సూచన మేరకు సెల్ఫ్ క్వారెంటైన్‌కు వెళ్లారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు తాను హాజరుకావడం లేదంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా తేలియజేశారు. లేఖలో ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. (టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్)
‘కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నాను. ఇటీవల వ్యాపార రీత్యా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్నాను. కనుక శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు వైద్యుల సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. (కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్)
Comments
Please login to add a commentAdd a comment