పింఛన్ల సర్వేలో టీడీపీ జులుం సరికాదు
రిమ్స్‌క్యాంపస్:ప్రభుత్వం చేపడుతున్న పింఛన్ల సర్వేలో టీడీపీ నాయకులు, కార్యకర్తల జులం సరికాదని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పింఛన్ల సర్వేను వారి ఇళ్లలో జరిపిస్తున్నారన్నారు. దీన్ని బట్టి కేవలం ఆ పార్టీ మద్దతుదారులకు మాత్రమే పెన్షన్ వచ్చేలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయూలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేయగా.. టీడీపీ ప్రభుత్వం మాత్రం కేవలం తమ పార్టీ వారికే పెన్షన్‌లు వచ్చేలా చర్యలకు పాల్పడటం అన్యాయమన్నారు. వచ్చే నెల ఆరో తేదీన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సర్వ సభ్యసమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. పార్టీ బీసీసెల్ రాష్ర్ర్ట అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన ఏకపక్షంగా జరుగుతోందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, రొక్కం సూర్యప్రకాష్, కోరాడ రమేష్ పాల్గొన్నారు.