సాక్షి, నెల్లూరు: సార్వత్రి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీలో అప్పుడే పదవుల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ పదవి ఖాళీ అయినా అది తమకేనంటూ నేతలు పోటీ పడుతున్నారు. పదవి తమకంటే తమకంటూ బలప్రదర్శనలకు దిగుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలు ఒక్కొక్కరికి ఒకరు మద్దతు పలుకుతుండడంతో టీడీపీలో అంతర్గతపోరు తీవ్రమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీ కాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈ స్థానం దక్కే అవకాశం ఉంది. అది కూడా జిల్లాకు చెందిన నేత మృతిచెందడంతో ఏర్పడిన ఖాళీ కావడంతో పలువురి దృష్టి దానిపై పడింది. ఎలాగైనా పదవి దక్కిచుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పదవి తమకంటే తమకంటూ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సర్వేపల్లి నుంచి మరోమారు ఓటమిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీపడుతున్నారు.
వీళ్లు చాలరన్నట్లు అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన పయ్యావుల కేశవ్ సైతం రాజ్యసభ స్థానం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని, కీలక సమయంలో జిల్లాలో టీడీపీని బతికించిన తనకు ఆ పదవి కట్టబెట్టాలని చంద్రబాబును ఆదాల కోరినట్లు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామ్మోహన్‌రావు మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలే టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచి వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమిపాలైన మాగుంట శ్రీనివాసులురెడ్డి దృష్టి కూడా రాజ్యసభ సీటుపై పడింది.
ఆయన ఈ విషయమై రెండు రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలను సంప్రదించినట్లు సమాచారం. మాగుంటకు సుజనాచౌదరి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పదవులకూ పోటీ పడుతూ భంగపడుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం ఒక్క అవకాశం అంటూ రాజ్యసభ సభ్యత్వంకోసం పోరు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా రాజ్యసభ అడిగానని, అనవసరంగా సర్వేపల్లి నుంచి పోటీచేయించి మరోమారు ఓటమికి గురిచేశారని, కనీసం రాజ్యసభ అయినా ఇచ్చి పరువు నిలపాలని సోమిరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో లాబీయింగ్ నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఓటమి చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఈ సీటును ఆశిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓటమిచెందిన పయ్యావుల కేశవ్ తనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టాలంటూ ఏకంగా టీడీపీ అధినేత పైనే వత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేశవ్ శనివారం చంద్రబాబును కలిసి కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఆదాల వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
టీడీపీలో రాజ్యసభ లొల్లి
Published Mon, May 19 2014 2:52 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement