
సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తొక్కని అడ్డదారి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించి కుట్రలకు పాల్పడిన టీడీపీ తాజాగా తమ పార్టీకి ప్రచారం చేసేలా అంగన్‌వాడీ కార్యకర్తలను పురమాయిస్తూ కుయుక్తులకు తెరలేపింది. విజయమే పరమావధిగా అంగన్‌వాడీ కార్యకర్తలతో రీజినల్ ఆర్గనైజర్ హోదాలో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కావలిలో టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్ శ్రీదేవికి ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్‌గా ఇటీవల పదవి ఇప్పించిన బీద సోదరులు ఆమె ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం చేయించేలా ఒత్తిడి పెంచుతున్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె అంగన్‌వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో పిలిపించి టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేయించేలా చూడటం వివాదాస్పదంగా మారుతోంది
ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఆగ్రహం
అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ ప్రచార సభగా మార్చేయడంపై పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతుల పేరుతో పార్టీలకతీతంగా దాతలను ఆహ్వానించాల్సిందిపోయి పార్టీ అభ్యర్థులను పిలిపించి ప్రచారం నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐసీడీఎస్ అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల ఆర్‌ఓ శ్రీదేవి ఆత్మకూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో రహస్యంగా అంగన్‌వాడీలతో సమావేశాలను నిర్వహించి ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సహకరించాలని ఆదేశించినట్లు తెలిసింది.
అలక మానిపించేందుకు
కావలిలో అధికార పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న శ్రీదేవి బీద సోదరుల వ్యవహార శైలితో ఇటీవల అలకబూనారు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం రావడంతో బీద సోదరులు సీఎంతో చర్చించి హడావుడిగా ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ పోస్ట్ ఇప్పించేలా చేశారు. వాస్తవానికి ఈ పోస్టును ఒంగోలుకు చెందిన టీడీపీ మహిళా నేత మాధవికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనా, బీద సోదరులు చివరి క్షణంలో శ్రీదేవి పేరును తెరపైకి తెచ్చి ఆమెకు దక్కేలా వ్యవహారం నడిపించారు. దీంతో అలకవీడిన ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించాక బీద సోదరుల కనుసన్నల్లో నడుస్తూ చిరుద్యోగులను టార్గెట్ చేసి వారితో పార్టీకి పనిచేయించేలా ఒత్తడి పెంచడం వివాదాస్పదంగా మారుతోంది.
పార్టీ ప్రచారం కోసం
ప్రభుత్వం అమలుచేసే పలు సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేసేందుకు అంగన్‌వాడీ వర్కర్లు కీలకంగా ఉన్నారు. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు నెరిపే వర్కర్లను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు తద్వారా ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు పెద్ద ఎత్తుగడే వేశారు. దీంతో అంగన్‌వాడీ వర్కర్లకు పార్టీ రంగు పులిమి వారితో ఎన్నికల ప్రచారం చేయించుకునేందుకు ప్రయత్నాలు మమ్మురం చేయాలంటూ కొత్తగా రీజినల్ ఆర్గనైజర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ మహిళా నేత శ్రీదేవిని రంగంలోకి దింపారు. ఆమె ఐసీడీఎస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి నియోజకవర్గాల వారీగా అంగన్‌వాడీ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ సమీక్షల్లోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు దాతల సహకారం కోరుతున్నామని చెప్తూ టీడీపీకి చెందిన అభ్యర్థులు, నేతలను సమీక్షలకు ఆహ్వానిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడంతో పాటు అందరితో ఓట్లు వేయించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలపై నేతల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలను సమీక్షల పేరుతో ఆత్మకూరులోని ప్రైవేట్ కల్యాణ మండపానికి పిలిపించి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య ద్వారా పార్టీ ప్రచారం చేయించిన విషయం వివాదాస్పదంగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేయిస్తే సంక్షేమ పథకాల అమలుతో పాటు జీతాలు పెంచుతామని ప్రలోభపెట్టేలా ప్రసంగం చేయడంపై పలువురు అంగన్‌వాడీలు అభ్యంతరం తెలిపారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించడంతో పెద్ద దుమారం రేగింది.