
టీడీపీ నుంచి దీపక్‌రెడ్డి సస్పెన్షన్
విజయవాడ: భూ అక్రమాల కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు పడింది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లో భూముల కుంభకోణంలో అరెస్టైన దీపక్‌రెడ్డిని బహిష్కరించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయడంతో టీడీపీ దిగివచ్చింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు ప్రయత్నించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వివాదంపై కూడా టీడీపీ సమన్వయ భేటీలో చర్చించారు. విభేదాలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులను చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం, నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కూడా సమన్వయ భేటీలో చర్చించినట్టు తెలిసింది.