పలాయనవాదమే లక్ష్యం  | Sakshi
Sakshi News home page

పలాయనవాదమే లక్ష్యం 

Published Sat, Sep 23 2023 4:33 AM

 TDP took the same stance on 2nd day in Legislative Assembly - Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్‌ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్‌’ స్కామ్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్‌ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు.

చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్‌ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్‌ సెషన్‌ మొత్తం సస్పెన్షన్‌ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్‌ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌–చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. 

సభ ప్రారంభమైంది మొదలు.. 
రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్‌ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్‌తో మూ­డంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. 

టీడీపీ తీరుపై మండిపాటు 
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగా­ర్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.    

నిషేధం ఉన్నా సెల్‌ఫోన్‌లతో చిత్రీకరణ 
మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు తమ సెల్‌ఫోన్‌ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్‌ చేయడం మొద­లుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడి­యో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాద్‌ రాజు స్పీకర్‌ను కోరారు.

వీడియో రికార్డింగ్‌ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నా­యుడు, అశోక్‌లను సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ రూల్‌ పాస్‌ చేశారు. దీంతో వీరిని మార్షల్స్‌ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్‌ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ,  గద్దె రామ్మోహన్‌ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్‌ ఊదుతూ హంగామా చేశారు.

సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్‌ వేటు వేస్తూ స్పీకర్‌ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్‌ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు.  

Advertisement
Advertisement