మర్రిపల్లి హెచ్‌ఎం సంచలన నిర్ణయం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ సమాచారం
ఉలిక్కిపడిన విద్యాశాఖ అధికారులు
విచారణ జరిపిన డెప్యూటీ డీఈవో
సాక్షి, కరీంనగర్ :
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను డీఈవోకు సరెండర్ చేయడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా మండల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి, ఉపవిద్యాధికారితోపాటు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికే కాకుండా ఏకంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కూడా సమాచారాన్ని పంపడం ఉపాధ్యాయవర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపారు. వేములవాడ మండలం మర్రిపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్రం బోధించే లచ్చిరెడ్డి, భౌతికశాస్త్రం చెప్పే లక్ష్మీనారాయణ అనే స్కూల్ అసిస్టెంట్లు సరిగా పనిచేయడం లేదని, పాఠాలు చెప్పడంలేదని, ప్రశ్నపత్రాలను దిద్దడంలేదని పేర్కొంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాంసుందర్ వారిని డీఈవోకు సరెండర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు డీఈవోకు ఆయన లేఖ రాశారు.
రాష్ట్రస్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా పంపించారు. పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే విచక్షణాధికారం ప్రధానోపాధ్యాయులకు ఉంటుందని, ఆ అధికారంతోనే తాను ఈ చర్యకు పూనుకున్నానని శ్యాంసుందర్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. తమ పాఠశాలలో పనిచేసే వారిపై ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవచ్చా లేదా అన్న అంశం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి ఉదంతం గతంలో ఎక్కడా జరగకపోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంపై సిరిసిల్ల ఉపవిద్యాధికారి కిషోర్ విచారణ జరిపారు. విచారణలోనూ తన విచక్షణాధికారం మేరకే వ్యవహరించానని శ్యాంసుందర్ చెప్పినట్టు తెలుస్తోంది.
నివేదిక ఇచ్చా : డెప్యూటీ డీఈవో
సరెండర్ వ్యవహారంపై మర్రిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి స్టేట్‌మెంటును తీసుకుని డీఈవోకు నివేదిక ఇచ్చినట్టు సిరిసిల్ల డెప్యూటీ డీఈవో కిషోర్ తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆయన సరెండర్ ఉత్తర్వులు ఇచ్చారని, ఆయనకు సరెండర్ చేసే అధికారాలు ఉండవని అన్నారు. ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోతే డీఈవోకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
డీఈవోకు టీచర్ల సరెండర్
Published Tue, Dec 31 2013 3:49 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM
Advertisement