ఒంగోలు టౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. భావి భారత పౌరులను తీర్దిదిద్దే గురువులపై దమనకాండకు దిగింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసిన సర్కారుపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన బుధవారం సీపీఎస్ రద్దుకు సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించమని ఫ్యాఫ్టో నాయకత్వం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్యాఫ్టో నాయకులను బైండోవర్ చేయడం, విజయవాడలో కనిపించిన ప్రతి ఒక్కరిని బలవంతంగా అరెస్టులు చేసి అక్కడి పోలీసు స్టేషన్లన్నింటికి తరలించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఫ్యాఫ్టో నాయకత్వం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారి కుటుంబాల్లో 60 లక్షల ఓట్లు ఉన్నాయని, చంద్రబాబును గద్దె దించేవరకు తాము పోరాడతామంటూ హెచ్చరికలు చేశాయి.
ఠాణాలకు టీచర్ల తరలింపు..
సీఎస్‌పురం: సీపీఎస్ రద్దు కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మంగళవారం సీఎస్‌పురం మండలంలోని ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్‌ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రెండు బృందాలుగా వెళ్లారు.
యూటీఎఫ్ సభ్యులను పెదకాకాని వద్ద, ఏపీటీఎఫ్ ఆద్వర్యంలో వెళ్లిన ఉపాధ్యాయులను గవర్నర్ పేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ఏరియాలలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
పోరాటం ఆగదు:
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిర్బం«ధం విధించింది. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ముందస్తు అరెస్టులు చేసింది. అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఫ్యాఫ్టో నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అరెస్టు చేయించింది. యాభై శాతం నాయకత్వాన్ని అరెస్టు చేయించింది. మిగిలిన యాభై శాతం విజయవాడ చేరుకుంటే అక్కడ కూడా బలవంతంగా అరెస్టులు చేయించింది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అరెస్టులు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్షేషన్‌లో తాము ఉపాధ్యాయులం కాదని చెప్పినా పదిమందిని అరెస్టు చేయించింది. రోడ్డుపై ఎవరూ కనిపించకూడదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనేది చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలి.
పిల్లి రమణారెడ్డి, ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్
కనబడితే అరెస్టులు:
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించాం. ఇంకోసారి విజయవాడలో మహా«ధర్నా చేపట్టాం. మరోసారి కలెక్టరేట్లను ముట్టడించి పాలనను స్తంభింప చేశాం. తప్పనిసరి పరిస్థితుల్లో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. ఉపాధ్యాయులు కనబడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు కానివారిని కూడా అరెస్టు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు. ముపై ఏళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
చల్లా శ్రీనివాసులు,
ఫ్యాఫ్టో జిల్లా సెక్రటరి జనరల్
Comments
Please login to add a commentAdd a comment