హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే సీమాంధ్ర జిల్లాలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోగా.. ఉపాధ్యాయులు కూడా వారికి మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు బుధవారం సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి ఒకటి ఏర్పాటైంది. కొత్త ఏర్పాటైన ఈ ఉపాధ్యాయ సమితిలో 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు జతకలవనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకూ ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇప్పటికే అరకొరగా నడుస్తున్న స్కూళ్లను పూర్తిగా స్తంభింపజేసేందుకు ఉపాధ్యాయులు నడుంబిగించారు. దీంతో సీమాంధ్రలో ఉన్న స్కూళ్ల కూడా మూతబడే అవకాశం ఉంది. తమ తదుపరి భవిష్యత్తు కార్యాచరణపై ఆగస్టు 18వ తేదీన ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో సమావేశం కానున్నాయి.