లిబియాలో టెక్కలి వాసి కిడ్నాప్
ఇద్దరిని వదిలినా... ఈయనకు దక్కని విముక్తి
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
ఫోన్‌లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్
బతుకు తెరువుకు... పొట్టపోషణకు... పరాయి దేశానికి వెళ్లిన ఆ యువకునికి ఎంతకష్టం ఎంతకష్టం... కన్నకొడుకు కసాయిచేతిలో చిక్కుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఎంత కలవరం. టెక్కలికి చెందిన గోపీకృష్ణ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు ముష్కరుల చేతుల్లో బందీ అయ్యారు. ఆయన్ను విడిపించాలని వారి కుటుంబ సభ్యులు సర్కారును వేడుకుంటున్నారు.
టెక్కలి : లిబియా దేశంలో టెక్కలికి చెందిన యువకుడ్ని ముష్కరులు కిడ్నాప్ చేశారని తెలుసుకున్న పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు రోజుల క్రితం లిబియా దేశంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తుల్లో టెక్కలి గొల్లవీధికిచెందిన తిరువీధుల గోపీకృష్ణ అనే వ్యక్తి ఉన్నట్టు శుక్రవారం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు, పట్టణవాసులు సైతం కలవరపడ్డారు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపించి గోపీకృష్ణతో పాటు మిగిలిన వారిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని బాధిత తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు.
ఏడేళ్లుగా లిబియాలో ఉద్యోగం
గొల్లవీధికి చెందిన విశ్రాంత కో-ఆపరేటివ్ ఉద్యోగి తిరువీధుల వల్లభనారాయణరావు, సరస్వతిల రెండో కుమారుడు గోపీకృష్ణ సుమారు 7 సంవత్సరాలుగా లిబియాలోని స్రిట్ యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన భార్య కల్యాణితో పాటు ఇద్దరు పిల్లలు జాహ్నవి, సాయిశ్వర్ , సోదరుడు మురళీకృష్ణ ఆయన కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, అమ్మమ్మ టెక్కలిలో ఉంటున్నారు. ప్రతీ ఏడాది జూలై చివరి వారంలో లిబియాలో సెలవులు ప్రకటిస్తారు. ఆ సమయంలో గోపీకృష్ణ హైదరాబాదు వస్తూంటారు. ఈ ఏడాదికూడా వచ్చాక తల్లిదండ్రులను కలిసేందుకు టెక్కలివస్తానంటూ సమాచారం అందించారు. రంజాన్ పురస్కరించుకుని లిబియాలో సెలవులు ప్రకటించడంతో బుధవారం లిబియా నుంచి హైదరాబాద్ రావడానికి ఎయిర్‌పోర్ట్‌కు కారులో వెళ్తుండగా ఉగ్రవాదులు కారును అడ్డగించి డ్రైవర్‌ను పక్కకు నెట్టేసి గోపీకృష్ణతో పాటు కర్ణాటకకు చెందిన ఇద్దరిని, హైదరాబాదుకు చెందిన ఒకరిని కిడ్నాప్ చేసినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. కిడ్నాప్ సమాచారం తమ పెద్దకుమారుడు మురళీకృష్ణకు తెలియడంతో ఆయన తమకు ఫోన్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నారు. దేశం కాని దేశంలో తమ కుమారుడు కిడ్నాప్‌కు గురైన సంగతి తెలియగానే ఆయన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనతో ఆందోళన చెందారు.
సాయంత్రానికి కిడ్నాప్ అయినవారిలో ఇద్దరిని విడిచిపెట్టినా.. తమ కుమారుడిని విడుదల చేయకపోవడంతో వారు మరింత ఖిన్నులవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎమ్.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఆర్.అప్పలరాజు టెక్కలిలోని వల్లభనారాయణరావు నివాసానికి వెళ్లి వారిని ఓదార్చి గోపీకృష్ణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. కిడ్నాప్ విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించినట్లు తమకు సమాచారం అందిందని ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు తెలియజేసారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గోపికృష్ణ విడుదలకు చర్యలు చేపట్టాలని ఆయన స్నేహితులు విన్నవిస్తున్నారు.
ఫోన్‌లో వివరాలు తెలుసుకున్న ఎంపీ, కలెక్టర్
ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ విడుదలయ్యేలా చర్యలు చేపడతానంటూ ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం బాధిత తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడారు. ఎస్పీ ఏఎస్.ఖాన్ కూడా ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు.
రోజూ భయాందోళనే:
లిబియా దేశంలో గఢాఫీ సంఘటనతో రోజూ భయాందోళనతో జీవించాల్సి వచ్చేదని లిబియాలో కొంతకాలంపాటు నివసించి తిరిగి టెక్కలి వచ్చేసిన లండ మోహనరావు తెలిపారు. లిబియాలోని పుంజులేటి కంపెనీలో పైప్ లైనింగ్ పనుల కోసం 2011 సంవత్సరంలో ఆ దేశానికి వెళ్లాననీ, అక్కడ గోపీకృష్ణ పరిచయం అయ్యారని తెలిపారు. గోపికృష్ణ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలపెట్టని మంచి వ్యక్తని చెప్పారు. లిబియాలో దాడులు జరుగుతున్న నేపధ్యంలో 2012 సంవత్సరంలో అక్కడి తాను నుంచి వచ్చేశానన్నారు. గోపీకృష్ణను కూడా వచ్చేయమని పలుమార్లు సూచించాననీ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉగ్రవాదుల చెరలో ఉన్న వ్యక్తుల్ని విడుదల చేయించాలని కోరారు.
ఎంత కష్టం... ఎంతకష్టం...
Published Sat, Aug 1 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement
Advertisement