ఫిబ్రవరి లోగా తెలంగాణ | Telangana Before in February | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి లోగా తెలంగాణ

Published Tue, Dec 31 2013 3:47 AM | Last Updated on Fri, Oct 19 2018 7:57 PM

Telangana Before in February

కట్టంగూర్ , న్యూస్‌లైన్ :ఫిబ్రవరి 2014లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మణవెల్లెంల కాలువ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2014 డిసెంబర్ వరకు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అభివృద్ది పనులను వేగవంతమవుతాయని తెలిపారు. బ్రాహ్మణవెల్లెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేసి  జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. సమన్యాయం అంటే ఏమిటో చెప్పకుండా ఢిల్లీలో దీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిచ్చోడని ఎద్దేవా చేశారు. 
 
 టీడీపీ అధినేత బీజేపీతో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్ర లు పన్నినా తెలంగాణను ఆపలేరన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లను  కానుకగా ఇవ్వాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రికి రూ.500 కోట్లు కేటాయించమని అడిగితే సీఎం కిరణ్ నిరాకరించారని తెలిపారు. తెలంగాణకు నిధులివ్వని సీఎంకు ఈ ప్రాంతాన్ని పాలించే హక్కు లేదన్నారు. సమావేశంలో  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకరబోయిన నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ చెవుగోని సాయిలు, సర్పంచ్ మేడి కృష్టయ్య, నాయకులు  పోగుల నర్సింహ, బీరెల్లి రామచంద్రయ్య, బూర్గు శ్రీను, మంగదుడ్ల వెంకన్న, గట్టిగొర్ల సత్తయ్య, ఎం. శేఖర్, మర్రి రాజు, రేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement