రాయల తెలంగాణను అంగీకరించం | Telangana groups reject Rayala Telangana proposal | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణను అంగీకరించం

Published Thu, Dec 5 2013 12:47 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Telangana groups reject Rayala Telangana proposal

చేవెళ్ల, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గురువారం నిర్వహిస్తున్న బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, అది తప్ప ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు.
 
 రాయల తెలంగాణను ఎవరూ అడగలేదని, రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు. భద్రాచలం, మునగాలలను వదులుకునే ప్రసక్తేలేదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆంకాంక్షకు విరుద్ధంగా రాయల తెలంగాణను ఏర్పాటుచేస్తే మరోమారు ఉద్యమం తప్పదన్నారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ పునరావృతం అవుతాయన్నారు. నేటి బంద్‌కు వ్యాపార, విద్యాసంస్థల యాజమానులు సహకరించాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రౌతు కనకయ్య, ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డి.ఆంజనేయులు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పాండు, శర్వలింగం, నర్సింహులు పాల్గొన్నారు.
 
 హోరెత్తిన నినాదాలు
 రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్య తిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. స్థానిక హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి జేఏసీ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, ఫయాజ్, నరేందర్ ర్యాలీకి ప్రాతినిథ్యం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement