తెలంగాణ మాత్రమే కావాలి
Published Thu, Dec 5 2013 6:24 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రాయల తెలంగాణ మాకొద్దు... తెలంగాణ మా త్రమే కావాలి’ అంటూ జిల్లా ప్రజానీకం నినదించింది. ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తా రా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెదక్‌లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు.
డైట్ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, నర్సాపూర్ తదితర మండల కేంద్రాల్లో విద్యార్థులు ర్యాలీలు తీశారు. పటాన్‌చెరులో జరిగిన ర్యాలీలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. జహీరాబాద్‌లో తొమ్మిదో నంబరు జాతీయ ర హదారిపై, నారాయణఖేడ్‌లో రాజీవ్ చౌక్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జోగిపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్ ప్రధాన వీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. చేగుంటలో జరిగిన నిరసన ర్యాలీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.
బంద్‌కు సన్నాహాలు
పార్టీ పిలుపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగే బంద్‌ను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం జరిగే బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జరిగే బంద్ టీజేఏసీ భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ వెల్లడించారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా సీపీఐ పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తు సెలవు ప్రకటించాయి. మరోవైపు బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
Advertisement