భగ్గుమన్న తెలంగాణ
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పార్లమెంట్‌లో గురువారం చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణవాదుల్లో ఆగ్రహజ్వాలలు రగలించాయి. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్ప్రే దాడి చేయడం, బిల్లును అడుకునే ప్రయత్నాలు చేయడంతో తెలంగాణవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేయగా, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మహిళా కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షలో ఎంపీ పొన్నం తల్లి పొన్నం మల్లమ్మ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మల్లమ్మ మాట్లాడుతూ తెలంగాణ కోసం తన కొడుకు ఎక్కువగా పోరాడుతున్నాడనే లగడపాటి స్ప్రే చల్లాడన్నారు.
నిజామాబాద్, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, కిరణ్, లగడపాటిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంపై న్యాయవాదులు కోడిగుడ్లతో దాడిచేశారు. తెలంగాణ న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ పార్టీ జెండాలను చింపివేశారు. కేయూ మొదటి గేటు వద్ద సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, నర్సంపేట తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
నర్సంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి నిప్పంటించారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎంపీల ఫ్లెక్సీలను, దళిత సంఘాల ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలని కాంగ్రెస్ నేతలు సర్వమత ప్రార్థనలు చేశారు. కాగా.. సీమాంధ్రుల ఆగడాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి ఖండించారు. ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఉద్యోగ జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో లగడపాటి దిష్టిబొమ్మలను దహనం చేశారు.