'తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణను అంగీకరించరు'
తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించరని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ మంత్రుల తరపున ఆయన ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింట్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాయల తెలంగాణ ప్రతిపాదన సరికాదని తప్పుపట్టారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు వివరించామని, ఈ మేరకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతు సభలు నిర్వహించామని లేఖలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయల ప్రతిపాదన విరమించుకుని వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని రాజనరసింహ కోరారు.