టీడీపీలో ‘పెనమలూరు’ పంచాయితీ
ఎన్టీఆర్ భవన్‌లో బాహాబాహీకి దిగిన వైవీబీ, ఇతర నేతల అనుచర వర్గాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తె లుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. టీవీల్లో జరిగే చర్చల్లో పాల్గొంటున్నామని చెప్పుకొనే వారికి , ప్రచారంతో పొద్దుపుచ్చేవారికే ప్రాధాన్యమిస్తున్నారంటూ వైవీబీని ఉద్దేశిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పార్టీ బాధ్యుడిని ఎంపిక చేసేందుకు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో భేటీ జరిగింది. ఆ స్థానానికి చలసాని పండు ఇన్ చార్జిగా వ్యవహరించేవారు. ఆయన హత్యకు గురైన తర్వాత ఎవరినీ ఇన్‌చార్జిగా నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి తీవ్రంగా పోటీ పడుతున్న వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో పాటు బడే ప్రసాద్, దేవినేని చంద్రశేఖర్, చలసాని పండు అనుచరులు భేటీకి హాజరయ్యారు. బాబుతో భేటీకి తమకు ఎందుకు ఆహ్వానం పంపలేదని వైవీబీని బడేప్రసాద్ అనుచరులు నిలదీశారు. ఆ ఆహ్వానాలతో తనకు సంబంధం లేదని వైవీబీ జవాబిచ్చారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి, పరస్పరం తోపులాటలతో పాటు ముష్టిఘాతాలకు దిగారు. కుర్చీలు విసురుకున్నారు.
చలసాని పండు కూతురు స్మితకు కానీ, ఆమె భర్తకు కానీ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరవర్గం, తమ నేతకే టికెట్ ఇవ్వాలని వైవీబీ, బడే ప్రసాద్ వర్గాలు నినాదాలు చేశాయి. ఈ సమయంలో పార్టీ నేతలంతా అక్కడే ఉన్నారు. భేటీకి వచ్చిన నేతలను సైతం మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఈ సమయంలో వివాదాన్ని ముగించేందుకు ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రయత్నించారు. కానీ, ‘ఏ సమస్యలు మీరు సెటి ల్ చేస్తారు? టీవీల్లో కూర్చుని చర్చల్లో పాల్గొనేవారికే ప్రాధాన్యం ఇస్తారా? వారితోనే మాట్లాడుకోండి. ఓట్లు సైతం వారితోనే వేయించుకోండి. అలాంటి వారినే పార్టీ పెంచి పోషిస్తోంది’ అంటూ అంతా నిలదీశారు. దాంతో ఎంపీ కంగుతిన్నారు. తర్వాత పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. అనంతరం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... వైవీబీ రాజేంద్రప్రసాద్ టీవీల్లో మాట్లాడటం, విలేకరుల సమావేశాలు పెట్టడం ద్వారా పార్టీ మొత్తం తనదే అన్నట్లు భావిస్తున్నారని దుయ్యబట్టారు. తనను అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ గొడవ చే యించారని చెప్పారు. కాగా.. సాయంత్రం తన నివాసంలో నేతలతో సమావేశమైన చంద్రబాబు వారి వాదనలన్నీ విన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గ బాధ్యుడిని ప్రకటిస్తానని హామీ ఇచ్చి పంపించారు.