ఆగని మరణ మృదంగం
రెండు నెలల్లో పదిమంది మృతి
ఆశ్రమాల్లో మెరుగుపడని వైద్యసేవలు
రక్తహీనతతో చిన్నారుల విలవిల
ఏటేటా కబళిస్తున్న వ్యాధులు
నిన్న మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో..నేడు జోలాపుట్టు బాలుర ఆశ్రమ వసతి గృహంలో.. ఇలా ఏజెన్సీలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. రెండు నెలల్లో పదిమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారుల చర్యలు కానరావడం లేదన్న ఆందోళన తల్లిదండ్రులు, గిరిజన, ప్రజాసంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో 1649 మంది చిన్నారులు చనిపోయారు. పౌష్టికాహార లోపంతో విద్యార్థులు రక్తహీనతకు గురవుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గి వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐటీడీఏ గతేడాది నుంచి నిర్వహిస్తున్న హెచ్‌బీ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయింది.
పాడేరు/ముంచంగిపుట్టు: ఆశ్రమ విద్యార్థులకు వైద్య సేవలు అందనంత దూరంలో ఉంటున్నాయి. ఇటీవ చోటుచేసుకుంటున్న సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. గురువారం హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. దీనిని మరిచిపోకముందే ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ వసతి గృహాం విద్యార్థి డురు సోమరాజు(9) శుక్రవారం ఇదే పరిస్థితుల్లో ఆకస్మికంగా మృతి చెందాడు. జోలాపుట్టు పంచాయతీ గొడ్డిపుట్టుకు చెందిన సోమరాజు ఆశ్రమంలో ఉంటూ అదే గ్రామంలోని ఎంపీపీఏస్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్వగ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం ఉదయం కడుపు, తలనోప్పిగా ఉందంటూ హాస్టల్ గదిలో పడుకున్నాడు. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం మేరకు ఆశ్రమానికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతదేహంతో తండ్రి ధనుర్జయ్, బంధువులు, గిరిజన సంఘం నాయకులు కె.అప్పల నర్సయ్య, కె.త్రినాధ్, పి.శాస్త్రిబాబులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.శ్యాంబాబు, ఏటీడబ్ల్యూవో వై.శాంతకుమారి వచ్చి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పరిస్థితి గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల దృష్టికి వెళ్లింది. ఆమె ఏటీడబ్ల్యూవోతో ఫోన్లో మాట్లాడారు. రూ.2లక్షలు పరిహారం పరిహారం ఇస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టానికి విద్యార్థి మృతదేహన్ని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.