
తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులతో సహా సీఎం నివాసం వద్ద ధర్నా చేపట్టారు..
సాక్షి, అమరావతి : ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులతో సహా సీఎం నివాసం వద్ద ధర్నా చేపట్టారు. 80 మందిని అనవసరంగా సర్వీసుల నుంచి తొలగించారని, ఉద్యోగాలు కోల్పోయి మూడేళ్లుగా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వస్తే అన్యాయంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వీసు నుంచి తొలిగించిన కొంతమంది కానిస్టేబుల్స్ ప్రాణాలు కూడా కోల్పోయారని, వారి కుటుంబాలకు గత మూడేళ్లుగా ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం అందలేదన్నారు. కనీసం వారిని ఆదుకోకపోగా మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సుమారు 80 మందిని ఉద్యోగాల నుంచి తీసేసారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.