
పింఛన్ల తొలగింపుపై ఉద్యమిస్తాం
పొదలకూరు: పింఛన్ల తొలగింపుపై తమ పార్టీ ఉద్యమిస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం సర్వేపల్లి, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పింఛన్ల ఏరివేత పెరిగిందన్నారు. తమకు చాలా మంది ఫోన్లు చేసి పింఛన్ తొలగించినట్టు వాపోతున్నారన్నారు. పింఛన్ల తొలగింపుపై వైఎస్సార్‌సీపీ అవిశ్రాంతంగా పోరాడుతుందని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పింఛన్ల ఎంపిక ప్రక్రియ నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విమర్శించారు. కమిటీల్లో సర్పంచులు, ఎంపీపీలు వైఎస్సార్‌సీపీకి చెందినవారు ఉన్నా వారిని నామమాత్రులను చేశారని విరుచుకుపడ్డారు. సామాజిక కార్యకర్తలు, పొదుపు సభ్యుల పేరుతో టీడీపీ కార్యకర్తలను కమిటీల్లో నియమించుకుని ఇష్టానుసారం పింఛన్ల లబ్ధిదారులను గుర్తించారన్నారు. అధికారులు సైతం చోద్యం చేస్తున్నారే తప్ప పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. ఏ కారణాలతో పింఛన్ తొలగిస్తున్నారో అధికారులు పరిశీలించాలన్నారు. కమిటీలో టీడీపీ సభ్యులు తొలగించమంటే తొలగిస్తున్నట్టు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ పింఛన్లను అందజేసినట్టు గుర్తుచేశారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్‌లో కొందరు కార్పొరేటర్లు ఇళ్లవద్దే పింఛన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు ఇప్పించుకునేందుకే కమిటీలను నియమించిందని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే నిలదీస్తామన్నారు. తొలిసారిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లాపార్టీ అధ్యక్షుని హోదాలో పొదలకూరుకు రావడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. విలేకర్ల సమావేశంలో పొదలకూరు ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచులు తెనాలి నిర్మలమ్మ, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, నెల్లూరు నగర కార్పొరేటర్ రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.