టీడీపీలోకి టీజీ, ఏరాసు?
* రాజధాని రాగం.. రంగు మార్చే వ్యూహం!
* వైఎస్‌ఆర్‌సీపీలోకి మూసుకుపోయిన దారులు
* కాంగ్రెస్‌లో ఉండలేక ‘పచ్చ’పార్టీలోకి...
* అందులో భాగమే రాజధాని డిమాండ్
* విభజన మచ్చ చెరిపేసుకునేందుకు ఎత్తుగడ
* చంద్రబాబుతో రహస్య మంతనాలు
కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ లేదని తెలుసుకున్న నాయకులు ఏదో ఒక సాకుతో పార్టీ మారేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారు. ఇన్నాళ్లు సమైక్య రాష్ట్రం తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ తంతు ముగియడంతో ఇప్పుడు సరికొత్త రాగం ఆలపిస్తున్నారు. కర్నూలును రాజధాని చేయాలనే వాదన వారి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. ఆ ముసుగులో రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలు ఇప్పటికే టీడీపీలో తమ బెర్తులు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రులు వారి అనుయాయులు సహా పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వీరు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ కావల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరికపై మరింత సమయం కావాలని గంటా బృందం కోరినట్లు సమాచారం.
అయితే బయటకు మాత్రం కర్నూలును తిరిగి రాజధాని చేయాలనే డిమాండ్‌తో చంద్రబాబు మద్దతు కొరేందుకు వెళ్తున్నట్లు ప్రకటించుకోవడం గమనార్హం. గత రెండు రోజులుగా టీజీ వెంకటేష్ రాజధాని డిమాండ్‌తో పాటు ప్రత్యేక రాయలసీమపై ప్రసంగాలు ఊదరగొడుతుండటం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎలాగోలా ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారనే చర్చ ఉంది. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న నాయకులు బహిరంగంగా నిర్ణయం తీసుకోవాలే కానీ.. ఇలా దొంగచాటుగా ప్రయత్నాలు చేయడం ఏమిటని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
టీజీ, ఏరాసులు టీడీపీలో చేరేందుకు ఈనెల 27వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు చర్చ జరిగినా.. ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. తక్కిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి రెండు రోజుల్లో వారినే అనుసరిస్తారని తెలిసింది. అయితే సమైక్య ఉద్యమంలో తన వంతు పాత్రతో ప్రజాభిమానం చూరగొన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు.. విభజనకు కారణమైన టీడీపీతో జట్టు కట్టినా ఒరిగేదేమీ లేదని వారికి కొందరు పార్టీ ముఖ్యులు నచ్చజెబుతున్నట్లు వినికిడి.
అటు కాంగ్రెస్‌లో ఉండలేక.. ఇటు వైఎస్‌ఆర్‌సీపీలో విభజనవాదులకు చోటు లేకపోవడంతో గత్యంతరం లేక టీడీపీ వైపు అడుగులేస్తుండటం చూసి అనుచరులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏదేమైనా టీజీ, ఏరాసులు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు.