కేంద్రంనిధులకూకొర్రీ
పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
అందులో 25 శాతం జెడ్పీకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు
రాష్ట్రం వాటా ఇవ్వకపోగా కేంద్రం గ్రాంటునూ గుంజుకోవడంపై సర్పంచుల గగ్గోలు
అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీలకు మరింత కష్టకాలం వచ్చిపడింది. నిధులు లేక, సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్న పంచాయతీలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మంజూరు చేసిన నిధులనూ నిర్దాక్షిణ్యంగా లాక్కుంటోంది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు.
మచిలీపట్నం : జిల్లాలోని 970 పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.37.65 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తలసరి గ్రాంటుగా ఒక్కొక్కరికి రూ.400 విడుదల చేయాల్సి ఉండగా మొదటి విడతలో రూ.129, రెండో విడతలో రూ.128 ఇచ్చింది. జిల్లాకు పూర్తిగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పంచాయతీలలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేసేందుకు స్మార్ట్ విలేజ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులివ్వకపోగా.. కేంద్రం ఇచ్చే ఈ నిధులతో అభివృద్ధి పనులు చేయాలని భావిస్తున్న సర్పంచులు, అధికారుల ఆలోచనలపై నీళ్లు చల్లుతోంది. విద్యుత్, తాగునీటి సరఫరాబిల్లులను చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మీరే మోయాలంటూ పంచాయతీలకు హుకుం జారీ చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో సర్పంచులు, అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.
25 శాతం నిధులు జెడ్పీకి జమ చేయాలని ఆదేశాలు...
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తలసరి గ్రాంటును గతంలో ప్రభుత్వ ఖాతాకు జమ చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను పక్కదారి పట్టిస్తోందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చే స్తోంది. జిల్లాలోని పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.37.65 కోట్లు విడుదల కాగా ఆయా సబ్‌ట్రెజరీల ద్వారా పంచాయతీల ఖాతాల్లో ఈ నగదు జమ చేశారు. ఈ నిధులను పంచాయతీలు వాడుకోకుండా ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఈ నిధుల్లో 25 శాతం జిల్లా పరిషత్ సీఈవో ఖాతాకు జమ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అన్ని పంచాయతీల కార్యదర్శులు, ఈవోలకు సెల్‌ఫోన్ మెసేజ్ పంపారు.
మండిపడుతున్న సర్పంచులు...
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులే ఇవ్వకుండా, విద్యుత్, తాగునీటి బిల్లులు చెల్లించకుండా.. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి 25 శాతం గుంజుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మైనర్ పంచాయతీల పరిస్థితి మరీ దయనీయం. అసలే అత్తెసరు ఆదాయంతో సతమతమయ్యే మైనర్ పంచాయతీలను కూడా వదలకపోవడంతో ఆయా సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం పంచాయతీ నిధుల నుంచే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయించారని, అంతటితో ఆగక అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విద్యుత్ బిల్లులను కూడా పంచాయతీలే చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని వాపోతున్నారు.