తల్లీ కొడుకుల బలవన్మరణం.. ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు కుటుంబానికి చేతబడి చేశారని వారి అనుమానం అందుకే కమలకు అనారోగ్యమట.. కొన్నాళ్లుగా ఒంటరిగా జీవనం కుటుంబ పెద్ద మానసిక స్థితిపైనా సందేహాలు ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే కొడుకులు
అక్కయ్యపాలెం: ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు.. ఇప్పుడు తల్లి, చిన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడటం విశాఖ నగరంలోని రామచంద్రనగర్‌లో కలకలం రేపింది. ఎవరో చేతబడి చేశారన్న అపోహతో కొన్నాళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ కుటుంబంలో ఇప్పుడు తండ్రే ఒంటరిగా మిగిలిపోయారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కె.వి.బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో మాచర్ల మహేశ్వరరావు తన భార కమల(48), చిన్న కొడుకు రవికుమార్(30)తో కలిసి చాలాకాలంగా నివసిస్తున్నారు. మహేశ్వరరావు ఒక ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టరుగా పనిచేసేవారు. భార్యకు, కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని అందుకే రెండేళ్లుగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అనుమానం. చేతబడి కారణంగానే భార్య అనారోగ్యం పాలైందని అంటున్నారు. ఈ క్రమంలో చేతబడి తీసే వారి కోసం మహేశ్వరరావు శనివారం సోంపేట వెళ్లాడు. అక్కడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లినా.. ఎవరూ దొరక్కపోవడంతో సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే గేటుకు తాళం వేసి ఉంది. ఎంత కొట్టినా ఎవరూ బయటకు రాలేదు. కొడుకు రవికుమార్‌కు సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన మహేశ్వరరావు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ కె.వి.బాలకృష్ణ, ఎస్సై బి.బి.శంకర్‌గణేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టినట్లు గుర్తించి, తలుపులు విరగ్గొట్టి లోపలకి ప్రవేశించారు. లోపల హాల్లోని ఫ్యాన్ హుక్‌కు వేలాడుతున్న కమల, రవికుమార్ మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను దించి పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి జీవితమే కారణమా?
అయితే ఈ కుటుంబానికి చాలా కాలంగా బంధువులు,స్నేహితులు, చుట్టుపక్కల వారితో సంబంధాలు లేవని, ఎవరితోనూ మాట్లాడరని పోలీసుల విచారణలో తెలిసింది. తమ కుటుంబానికి చేతబడి చేశారన్న అనుమానం పెంచుకున్న మహేశ్వరరావు మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలుస్తోంది. ఇతని కారణంగానే భార్య అనారోగ్యం పాలైనట్టు స్థానికులు చెబుతున్నారు. తల్లి ఆరోగ్యం బాగోకపోవడంతో చిన్న కొడుకు రవికుమార్ టీసీఎస్‌లో ఉద్యోగం మానేసి ఏడాదిగా ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్ద కొడుకు భాస్కరరావు కూడా ఇదే రీతిలో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా కొడుకు శవాన్ని మూడు రోజులపాటు ఇంటిలో ఉంచుకొని ఎవరికీ సమచారం ఇవ్వలేదు. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారి పిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా కమల, రవికుమార్‌లు శనివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మరణానికి మానసిక పరిస్థితే కారణామా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. బంధువులు, స్నేహితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ కుటుంబంపై పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.
అనుమానమే ఆత్మహత్య భూతమై..!
Published Mon, Jan 18 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement