డీన్ నియామకంపై రగడ
బాపట్ల టౌన్: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యవసాయ కళాశాల ప్రస్తుతం ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు అసోసియేట్ డీన్ నియామకంపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు రెండో రోజు శనివారం తరగతులు వదిలి.. ప్లకార్డులు చేతబూని రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి.. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే కనీసం మారుమూల ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, కళాశాలలో ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసి ఉండాలి.
డీన్ అయ్యేనాటికి 15 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ప్రస్తుతం అసోసియేట్ డీన్‌గా కొనసాగుతున్న డాక్టర్ దర్శి విష్ణుశంకరరావు ఆ మే రకు అర్హతలు ఉన్నాయి. అలా అర్హతలు లేని పీఆర్‌కే ప్రసా ద్‌ను అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టవ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి..
నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు వాటిని ఉపసంహరించుకుని కళాశాల ప్రగతికి తోడ్పడాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు సూచించారు. విష్ణుశంకరరావుకు మద్దతుగా శనివారం ప్రొఫెసర్లు కళాశాల ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీనియర్టీలో ఐదో స్థానంలో ఉండి, వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం కూడా లేని వ్యక్తిని డీన్‌గా నియమించడం కేవలం రాజకీయ కారణమేనని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. నాన్ టీచింగ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కళాశాల ముందు ఆందోళనకు దిగారు.
విద్యార్థుల ర్యాలీ, మానవహారం..
అసోసియేట్ డీన్‌ను మార్పుచేయడం సరికాదంటూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లో విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. ముందస్తు అనుమతి లేకుండా మానవహారం ఏర్పాటుచేయకూడదని సీఐ పేర్కొనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్ధులంతా ఒక్కసారిగా డౌన్..డౌన్...సీఐ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారాన్ని విరమించి కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు.