వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రపంచానికే భారతీయ సంస్కృతి దిక్సూచి వంటిదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంత మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం ‘కృష్ణాతరంగ్-2013’ అంతర్ కళాశాల యువజనోత్సవాలు శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి యువజనోత్సవాలను వెలంపల్లి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యావత్ సాంస్కృతిక రంగంలోనే ఇమిడి ఉందన్నారు.
ముఖ్యఅతిథిగా హజరైన విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య డీ.సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసేందుకే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కృష్ణాతరంగ్ పేరుతో యువజనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. యువజనోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు వివిధ సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పనున్నారని చెప్పారు.
గౌరవ అతిథిగా హజరైన ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను సద్వినియోగించుకుని మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.బసవేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లోనూ ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు.
ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో అనేక మంది ప్రముఖులను జల్లా అందించిందని చెప్పారు. అటువంటి సాంస్కృతిక రంగంలో యువత సైతం అద్భుత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరకృష్ణ, హిందూహైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ఉప్పల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు...
కృష్ణాతరంగ్-2013 అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీల్లో తొలి రోజు శనివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జాతీయ బృందగానం, పాశ్చాత్య బృందగానం, క్విజ్ ప్రిలిమ్స్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్లేమోడలింగ్, శాస్త్రీయ నృత్యం, జానపద వాద్యం, వక్తృత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మొవ్వ, ఉయ్యూరు. నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హజరయ్యారు.
అత్యుత్తమం భారతీయ సంస్కృతి
Published Sun, Dec 8 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement