రాష్ట్రంలో సామాజికవర్గాల గణన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు తెలుసుకునేందుకు సర్వే చేయించి దానికనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. దామాషా పద్ధతిలో ప్రతి సామాజికవర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్న వాల్మీకి-బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నేతృత్వంలో వాల్మీకి-బోయ సామాజికవర్గ ప్రతినిధులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బీసీ-ఎ జాబితాలో ఉన్న తమను కర్నాటకలో మాదిరిగా ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వాల్మీకి-బోయలను ఎస్సీలుగా గుర్తించారని, రాష్ట్రంలోనూ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఎన్‌టీఆర్ హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలుగుదేశం మేనిఫెస్టోలోనూ దీనిపై హామీ ఇచ్చినట్లు వారు గుర్తుచేశారు.
కర్నాటకలో హవనూర్ కమిషన్ వేసి 1991లో ఆర్డినెన్స్ ద్వారా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీ తీర్మానం లేదా కమిషన్ ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కరించవచ్చని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇచ్చిన హామీ ప్రకారం వాల్మీకి-బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపై స్పష్టత తీసుకుంటామని తెలిపారు.