కిరణ్ హయాంలో రూ.4,300 కోట్లతో పథకం
8,468 గ్రామాలకు తాగునీరు లక్ష్యం
మొదటి దశ పనులకు టెండర్లు పిలిచిన కిరణ్ సర్కార్
పథకాన్ని పక్కన బెట్టిన బాబు ప్రభుత్వం
జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోని వైనం
సాక్షి, చిత్తూరు : జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన కండలేరు తాగునీటి పథకానికి చంద్రగ్రహణం పట్టింది. జిల్లాలో సగం ప్రాంతానికి తాగునీరు అందించేలా రూ పొందించిన ఈ పథకాన్ని పూర్తిచేస్తే కిరణ్‌కుమార్‌రెడ్డికి పేరొస్తుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన బెట్టినట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.4300 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు.
జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో 45 మండలాల పరిధిలోని 8,468 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యం. కండలేరు నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద 420 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ట్యాంకు నిర్మించడంతోపాటు 32 చిన్నచిన్న రిజర్వాయర్లు సైతం నిర్మించేలా రూపకల్పన చేశారు. ఒక్కో క్లస్టర్ రిజర్వాయరు పరిధిలో 150 నుంచి 200 గ్రా మాలకు తాగునీటిని అందించాల్సి ఉంది.
రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులను ఇన్‌క్యాప్‌కు అప్పగించారు. తొలి విడతలో రూ.750 కోట్ల తో 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కూడా పిలిచారు. తెలుగుగంగలో భాగమైన కండలేరు జలాశయం నుంచి 6.61 టీఎంసీ నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చినా అప్పట్లో కిరణకుమార్‌రెడ్డి ఆ జిల్లా నేతలను ఒప్పించిన విషయం తెలిసిందే. ఇంతలో ఎన్నికలొచ్చాయి.
బాబు రాకతో కండలేరు పథకానికి గ్రహణం
చంద్రబాబు అధికారంలోకి రావడంతో కండలేరు తాగునీటి పథకానికి గ్రహణం పట్టింది. ఈ పథకంతో వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా కిరణ్‌కుమార్‌రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని పక్క న బెట్టారు. రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఎలా ఉన్నా కృష్ణాజలాలు తమిళనాడుకు ఇవ్వాలన్న ఒప్పందం నేపథ్యంలో కండలేరులో నిత్యం నీళ్లు నిలువ ఉంటాయి. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కిరణ్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది.
మరోవైపు జిల్లాలో రోజురోజుకూ తాగునీటి సమస్య పెరుగుతోంది. రెం డు నెలలక్రితం 1713 గ్రామాలకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2600 గ్రామాలకు పెరిగింది. గతంలో నెలకు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తుండగా ప్రస్తుతం నీటి సరఫరా ఖర్చు రూ.6 కోట్లకు చేరింది. అయినా సక్రమంగా నీళ్లివ్వలేని పరిస్థితి. నిధులపరంగా, నీటి పరంగా చూసుకున్నా కండలేరు తాగునీటి పథకాన్ని పూర్తిచేయడమే మేలని ఒకవైపు నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పథకాన్ని పక్కనబెట్టి హంద్రీ- నీవా అంటూ పాడిందే పాడుతూ మాటలతో సరిపెడుతున్నారు.
కండలేరుకు ‘చంద్ర’ గ్రహణం
Published Mon, Apr 27 2015 4:33 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM
Advertisement