
ఎన్నికల విధానంలో సంస్కరణలు తేవాలి
ఎన్నికల విధానంలో లోపాలను తొలగించి సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా చెప్పారు.
సాక్షి, విజయవాడ బ్యూరో : ఎన్నికల విధానంలో లోపాలను తొలగించి సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా చెప్పారు. దామాషా పద్ధతిలో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆయా పార్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సివుందన్నారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 31 శాతం మంది ఓట్లు వేస్తే 288 సీట్లు వచ్చాయని, నాలుగు శాతం ఓట్లు వచ్చిన బీఎస్పీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాలేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. ఈ సమస్యను అధికమించాలంటే దామాషా పద్ధతిని అవలంభించాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఇది అమలైనప్పుడే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంలోని ప్రజల అభిప్రాయానికి విలువ ఇచ్చినట్లవుతుందని తెలిపారు.
ప్రపంచంలోని 40 పైగా దేశాలు ఈ విధానంలో ఎన్నికలు జరుపుకుంటున్నాయని చెప్పారు. ఈ మార్పుల గురించి ఇతర పార్టీలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ 23 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు రాజా అభినందనలు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు కె నారాయణ మాట్లాడుతూ ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకూ సీపీఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
4న రుణమాఫీపై మండలకేంద్రాల్లో వద్ద సామూహిక రాయబారాలు
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ జులై 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో కార్యాలయాలు, బ్యాంకుల వద్ద సామూహిక రాయబారాలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. సీజన్ మన కోసం ఆగదని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రుణాలు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. జులై 11వ తేదీన నగరం గ్యాస్ ప్రమాదంపై చర్చించేందుకు అమలాపురంలో నిపుణులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
‘అల్లూరి’ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి
దీనికిముందు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను రామకృష్ణ విడుదల చేశారు. మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఆయన వర్థంతి, జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని తీర్మానంలో కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశలో ఇప్పుడున్న 13 జిల్లాలను 25 పెంచాలని, జనాభాను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ డివిజన్లను పెంచాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.