ఈ ‘రోగానికి’ మందులేదా?
- అధ్వానంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి
- బంధువులే రోగులను తీసుకెళ్లాల్సిన దుస్థితి
విజయవాడ : ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు..’ పాట గుర్తుకొస్తోంది ప్రభుత్వాస్పత్రిని చూస్తుంటే. చినుకు పడితే చాలు ఆస్పత్రి ప్రాంగణం చిత్తడిగా మారుతోంది. వర్షపు నీరు పారేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున ఆవరణంతటాకాన్ని తలపిస్తోంది. దీంతో రోగులు ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం వందలాది మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వాస్పత్రిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారు సైతం బురదనీటిలో నడిచివెళ్లక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోగిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంధువులే తీసుకెళ్లాల్సివస్తోంది. ఆస్పత్రి చుట్టూ నీరు నిలవడంతో దోమలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి.
ముఖ్యంగా ఆస్పత్రి వెనుకవైపు, డయాగ్నోస్టిక్ బ్లాక్ పక్కన, ఎదురుగా నిత్యం నీరు నిలిచే ఉంటుందని, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.