ఉగ్ర రైతు
సబ్సిడీ విత్తనం.. ‘అనంత’ కరువు రైతుకు ఇదో వరం. కానీ పాలకుల ప్రణాళికాలేమి, అధికారుల నిర్లక్ష్యం వెరసి అన్నదాతలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా విత్తన కొరత రావడం.. రెండో విడత పంపిణీపై స్పష్టత లేకపోవడంతో శనివారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రైతులకు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ అధికారులు, సర్కారు తీరుపై మండిపడ్డారు.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా వర్షం పడడంతో రైతులు విత్తనం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. అతికష్టంమీద ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన మొదటి విడతలో 2.15 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేసిన జిల్లా యంత్రాంగం ఇపుడు రెండో విడత పంపిణీపై హామీ ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం వైఖరిని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం కూడా పలు మండలాల్లో అన్నదాతలు విత్తన డిమాండ్‌తో రోడ్లమీదకు వచ్చారు. ముందస్తుగా వర్షాలు కురవడం, జూన్ 15 నుంచి వేరుశనగ పంట సాగుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెప్పడంతో పంటల సాగు కోసం రైతులు ఎగబడుతున్నారు.
రైతులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాలు కూడా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నా పాలక యంత్రాంగం నుంచి స్పష్టమైన భరోసా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర్మవరం మండల రైతులు స్థానిక మార్కెట్‌యార్డు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అలాగే ముదిగుబ్బ మండలం కేంద్రంలో అనంతపురం, కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనకల్లులో వందలాది మంది రైతులు స్థానిక అంబేద్కర్‌సర్కిల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. గోరంట్లలో వైఎస్సార్ సర్కిల్, నాలుగు రోడ్ల సర్కిల్‌లో సుమారు 500 మంది రైతులు ఆందోళన నిర్వహించారు.
ఈనెల 14వ తేదీ ఇచ్చిన కూపన్లు కూడా సక్రమంగా విత్తన పంపిణీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో రైతులు అనంతపురం, కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కూడేరు, వజ్రకరూరులో కూడా రాస్తారోకోలు నిర్వహించారు. గాండ్లపెంట, అమడగూరు, నల్లమాడ తదితర మండలాల్లో కూడా రైతులు ఆందోళనబాట పట్టారు. 20వ తేదీ నుంచి రెండో విడత ఇస్తామంటూ ఈనెల 14న పలు మండలాల్లో అధికారులు మైకుల్లో ప్రకటించడంతో శనివారం చాలా మండలాల్లో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళనలో భాగంగా తహశీల్దార్, ఏవోలకు వినతి పత్రాలు సమర్పించినా కలెక్టర్, జేడీఏ స్థాయి అధికారులు ప్రకటన చేస్తే కాని తాము ఏమీ చెప్పలేమని చేతులెత్తేయడంతో రైతులకు విత్తన కష్టాలు కొనసాగుతున్నాయి.