వాట్సాప్‌లో ప్రశ్నపత్రం | The document in question whatsup | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం

Published Thu, Apr 21 2016 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

The document in question whatsup

డిగ్రీ ద్వితీయ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం లీక్
ఉలిక్కిపడిన ఏయూ అధికారులు  పరీక్ష రద్దు.. విచారణ ప్రారంభం
ముందు జరిగిన  ప్రశ్నపత్రాలు కూడా లీక్?
నర్సీపట్నం ప్రాంతంలో  లీకైనట్లు సమాచారం

 

ఏయూ క్యాంపస్: ప్రశ్నపత్రాల లీకుల జాఢ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరోమారు ఉలికిపాటుకు గురి చేసింది. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చింది. వాట్పాప్ ద్వారా పలువురికి చేరిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు పరీక్షను రద్దు చేసి, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రాథమికంగా నర్సీపట్నం ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో  పశ్నపత్రం లీకైనట్లు అధికారులకు సమాచారం అందింది.


లీక్ ధ్రువీకరణ : మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మొబైల్‌కు వాట్పాస్ ద్వారా ప్రశ్నపత్రం వచ్చింది. వెంటనే ఆయన కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి అసలు ప్రశ్నపత్రం తెప్పించి సంబంధిత అధికారుల సమక్షంలో రెండింటినీ పరిశీలించారు. రెండింటిలోనూ ప్రశ్నలు ఒకేలా ఉండటంతో  ప్రశ్నపత్రం లీక్ అయిందని ఖరారు చేసుకున్నారు. నర్సీపట్నం ప్రాంతంలోని ఒక కళాశాలలో ప్రశ్నపత్రం లీక్ అయిందనే ప్రాథమిక సమాచారంతో యూజీ పరీక్షల డీన్ ఆచార్య సుదర్శనరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లను వెంటనే నర్సీపట్నం పంపారు. ఇదంతా జరిగేసరికి సాయంత్రం 4 గంటలు అయింది. పేపర్ లీక్ అయిందనే విషయం కళాశాలలకు తెలియకపోవడంతో యథావిధిగా పరీక్ష బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. దాంతో బుధవారం జరిగిన కెమిస్ట్రీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో స్పెషల్ అబ్జర్వర్స్‌ను వేయడంతోపాటు అవసరమైచోట పరీక్ష కేంద్రాలను మారుస్తామన్నారు. ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తించి.. అక్కడి కేంద్రాన్ని రద్దు చేస్తామన్నారు. విచారణ జరిపి అవసరమైతే కళాశాల గుర్తింపును సైతం రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మరికొన్ని పేపర్లు లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు.

 
లీకులను ఆపలేరా?

గతేడాది ఇదే విధంగా విశాఖలోని బుద్ద రమేష్ బాబు డిగ్రీ కళాశాలలో ప్రశ్నపత్రం లీక్ అయింది. అధికారులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని లీక్ అయిన విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. వర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయానికే పరీక్ష ప్రారంభం అయిపోతుంది. దాంతో సీల్డ్ కవర్‌ను ముందుగా ఓపెన్ చేశారా లేదా అనే విషయం తెలిసే అవకాశం లేదు. దోషులు దొరుకుతారా అనే విషయం తెలియడం లేదు. అంతకు ముందు సంవత్సం వర్సిటీ ఉద్యోగి ఒకరు తన మిత్రుడి కుమార్తె కోసం ఇంజినీరింగ్ ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చారు. అతడ్ని కంటి తుడుపు చర్యలతో వదిలిపెట్టేశారు. ఫలితంగా వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ సర్వసాధారణ విషయమనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద, పురాతన వర్సిటీ అయిన ఏయూకు ప్రశ్నపత్రాల లీకేజీ పెద్ద సమస్యగా మారుతోంది. సుదీర్ఘ అనుభవం కలిగిన పరీక్షల విభాగం లీకులను అరికట్ట లేకపోవడానికి కారణాలు తెలియడంలేదు. అనుభవజ్ఞులైన సిబ్బంది, అధునాతన సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ లీకులను అరికట్టలేకపోవడం వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది.

 
కఠిన చర్యలతోనే అడ్డుకట్ట......

వర్సిటీ ఉదాసీన వైఖరి ఇటువంటి వాటికి ఆస్కారం కల్పిస్తోంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినపుడు కఠిన చర్యలు తీసుకొని ఉంటే అవి పునరావృతమయ్యేవి కావు. అధికారులు కొరడా ఝుళిపించకపోవడం అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. కళాశాలల నుంచి వచ్చే ఒత్తిడి సైతం అధికారులను చర్యలు తీసుకోనివ్వకుండా అడ్డుకుంటోందనే వాదన వినిపిస్తోంది. వర్సిటీ అధకారులు ప్రత్యేక దృష్టిసారించి పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన  చేయాల్సిన అవసరం ఉంది.

 


ప్రశ్నపత్రం లీక్ వాస్తవమే..
నర్సీపట్నం: పరీక్ష సమయం కంటే ముందే ప్రశ్నపత్రం నర్సీపట్నంలో మొబైల్ ఫోన్‌లో హాల్‌చల్ చేయడంతో స్పందించిన ఏయూ అధికారులు   రిషీ, వివేకానంద, డాన్‌బాస్కో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీన్ సుదర్శన్‌రావు   మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు విచారణ చేపట్టామన్నారు. పరీక్ష సమయం కంటే ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందన్నారు. ఆయన వెంట  కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నటరాజన్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.వి.సుధాకర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement