కొండంత నిర్లక్ష్యం
శ్రీకృష్ణదేవరాయల పాలన ఎంత ఘనంగా సాగిందన్న దానికి పొరుగునున్న కర్ణాటకలోని హంపి తర్వాత పెను‘కొండ’ కోట మచ్చుతునక. చరిత్రకు సాక్షాలుగా నిలిచిన పెను‘కొండ’ కట్టడాలను భావి తరాల వారూ తిలకించేలా భద్రంగా కాపాడటంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి.. గుప్త నిధుల కేటుగాళ్ల తవ్వకాలతో ‘కొండ’పై రాయల వైభవం మసకబారుతోంది.
చారిత్రక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న ఆర్భాటపు ప్రకటనలతోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. హంపి, గోల్కొండ, చంద్రగిరి కోట విషయంలో పర్యాటక శాఖ అధికారులు చూపుతున్న శ్రద్ధలో పదో వంతు పెను‘కొండ’పై చూపితే అనతికాలంలోనే అసంఖ్యాక పర్యాటకుల ఆదరణ చూరగొంటుందనడంలో సందేహం లేదు. మొక్కుబడి ఉత్సవాలతో చేతులు దులుపుకోకుండా ప్రజాప్రతినిధులు అభివృద్ధికి చేయూతనివ్వాలి.
పెనుకొండ/ సాక్షి, అనంతపురం : ప్రఖ్యాతిగాంచిన పెనుకొండలోని కోట, ఇతర చారిత్రక కట్టడాల సంరక్షణలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో గుప్త నిధుల కేటుగాళ్లు విచ్చలవిడిగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. రాయల ఉత్సవాలపై చూపుతున్న శ్రద్ధ.. ఈ కట్టడాల సంరక్షణపై కూడా చూపితే బావుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గగన్‌మహల్, గాలిగోపురం, నాటి పరిపాలనా భవనమైన ఖిల్లా, బసవణ్ణ బావి, తిమ్మరుసు బందీఖానా, పలు ఆలయాలు.. విజయనగర రాజుల పాలనకు దర్పణం పడుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
కొండ పైభాగంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. గుప్త నిధుల వేటగాళ్ల తవ్వకాలతో ఆలయ రూపురేఖలే మారిపోయాయి. ఆలయంలోని నరసింహస్వామి మూలవిరాట్టునే పెకిలించివేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆలయం లోపల, గర్భగుడిలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేసిన దృశ్యాలు ఇక్కడి దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఖిల్లా, తిమ్మరుసు సమాధి తదితర ప్రాంతాలు వేటగాళ్ల తవ్వకాల మూలంగా ధ్వంసమయ్యాయి. కట్టడాల అభివృద్ధి, లక్ష్మీనరసింహ ఆలయం పూర్వ వైభవానికి కృషి చేస్తామని గతంలో జరిగిన రాయల ఉత్సవాల్లో మంత్రులు, అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సైతం గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఆలయం పునర్నిర్మాణానికి తగిన సహకారం అందిస్తామని ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో హామీ ఇచ్చారు. అధికారులు సైతం గట్టి చర్యలు చేపడతామని చెప్పారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. కొండపైకి వాహనం వెళ్లడానికి వీలుగా రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో రూ. 5.50 కోట్లు కేటాయించారు. ఆ పనులు సగంలోనే ఆగిపోయాయి. కల్వర్టు, మట్టిపనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు వున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తికాకుండానే కల్వర్టులు దెబ్బతినడం ఈ విమర్శలకు బలాన్నిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు.
ఆక్రమణలను పట్టించుకున్న వారే లేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆక్రమించిన వారికి సలాములు కొడుతున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడానికి అడుగు ముందుకు వేసిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. కొండ రోడ్డులో అర్ధంతరంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి రూ.6 కోట్ల మేర అవసరమున్నా నిధులు విడుదల అనుమానంగా మారింది. మ్యూజియం ఏర్పాటుకు స్థల సేకరణతోనే పుణ్య కాలం కాస్తా గడచిపోయేలా వుంది. కొండపైకి విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేక పోయారంటే అధికారుల అలసత్వం ఏపాటిదో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
పెను‘కొండ’ను వీక్షించడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా.. వారిని ఆకట్టుకుని ఇక్కడి చరిత్రను, గత వైభవాన్ని తెలియజెప్పేందుకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. గుప్త నిధుల వేటగాళ్ల తవ్వకాలతో ఈ ప్రాంతం కళావిహీనంగా మారుతుంటే అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు మీడియా ఎదుట షో చేయడం మినహా నిర్ధిష్టంగా తీసుకున్న చర్యలంటూ ఏవీ లేవు. ప్రస్తుతం రాయల ఉత్సవాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంత విశిష్టతను కాపాడటంలో శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధితో పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి కలుగుతుందనే వాస్తవాన్ని వారు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
‘కొండ’పై కేటుగాళ్ల దృష్టి
విజయనగర సామ్రాజ్యం విస్తరించిన పలు ప్రాంతాల్లో నాటి రాజులు ఆలయాల నిర్మాణానికి పెద్దపీట వేశారు. అద్భుత శిల్పకళతో అపురూప కట్టడాలకు ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్‌లో ఈ ఆలయాలు దెబ్బతింటే.. పునర్నిర్మాణానికి, మరమ్మతులకు ఎవరిపై ఆధారపడకుండా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే కొన్ని ఆలయాలు, కట్టడాల సమీపంలో నిధి నిక్షేపాలు ఏర్పాటు చేశారని పురావస్తు శాఖ పరిశోధనల్లో వెల్లడైంది.
విజయనగర సామ్రాజ్యం అస్తమించే సమయంలో సంపద పరాయివారి వశం కాకుండా ఎక్కడపడితే అక్కడ దాచిపెట్టారనే వాదన కూడా ఉంది. ఈ విషయాలపై లోతుగా అధ్యయనం చేసిన కొందరు కేటుగాళ్లు ముఠాలుగా ఏర్పడి రాత్రిళ్లు తవ్వకాలు సాగిస్తుండటం పరిపాటి. ఆ సమయంలో అటువైపు ఎవరైనా వెళ్తే వారి ఉనికి బయట పడుతుందని భావించి కడతేర్చడానికి సైతం వెనుకాడరని గత సంఘటనలు వెల్లడిస్తున్నాయి. గుప్త నిధులు దక్కించుకునే క్రమంలో ఎందరో ప్రాణాలు సైతం (పంపకాల్లో గొడవల వల్ల) కోల్పోయారు.