రాజధాని పేరుతో కాలయాపన
సర్కారు తీరుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సారథి విమర్శ
రేపు పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించ నున్నట్లు వెల్లడి
పుట్రేల (విస్సన్నపేట) : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. హామీలను మరిచి రాజధాని పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. మండలంలోని పుట్రేల గ్రామంలో మారెమ్మ గుడి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు.
రైతులకు చేయాల్సిన రుణమాఫీ రూ.87 వేలు కోట్లు ఉండగా మొదటి విడతగా రూ.6 వేలు కోట్లు మించి మాఫీ చేసింది లేదన్నారు. రెండో విడత మాఫీ సొమ్ము చాలా మందికి ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. పత్రికల్లో మాత్రం రూ.26 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు ఇస్తామన్నారని, ఇంతవరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళా గ్రూపులకు రుణమాఫీలోను అదే తీరు అవలంబించారన్నారు.
పబ్లిసిటీ తప్ప చేసిందేమీ లేదు : ఎమ్మెల్యే రక్షణనిధి
రాష్ట్ర ప్రభుత్వం గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని, ఎన్నికల వాగ్దానాల అమలు పూర్తిస్థాయిలో చేయలేదని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి విమర్శించారు. పట్టిసీమ నీళ్లతో ఎకరానికి 50 బస్తాలు పండించామంటున్నారని, గతంలో తిరువూరు నియోజకవర్గంలో సాగర్ మూడో జోన్ కింద ఎకరానికి 60 బస్తాలు పండించిన సంగతేమిటని ప్రశ్నించారు. అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలో పంటలు ఎండిపోయి జిల్లేడు చెట్లు మొలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ సుజలధార ఏ గ్రామంలోనైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఒక్క కాలనీ ఇళ్లయినా మంజూరు చేశారా అని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక చోట్ల పింఛన్లు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలోకి వెళ్లగానే అభివృద్ధిని చూసి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారని, మొన్నటిదాకా లేని అభివృద్ధి ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. సాక్షి చానల్ ప్రసారాలను నిలుపుదల చేయటం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించటం సరికాదని స్పష్టం చేశారు.
ఖాలీ పోస్టుల భర్తీ ఎప్పుడు? : ఉదయభాను
రాష్ట్రంలో లక్షా 30 వేల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉండగా ఒక్క పోస్టూ భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి చెల్లించటంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సామినేని ఉదయభాను అన్నారు. ప్రాజెక్టుల పేరుతో టెండర్లు వేసిన తర్వాత దానికి రెండింతలు పెంచి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రానున్న రోజుల్లో బాబు సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాణి, పార్టీ నేతలు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, సిరసాని ప్రకాష్, భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, నెక్కళపు కుటుంబరావు, దారావతు శ్రీను, రమేష్, సర్పంచ్ పెద్దిబోయిన కేశవులు తదితరులు పాల్గొన్నారు.