సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజన నిరసన జ్వాలలు జిల్లాలో మరింత ఉధృతమయ్యాయి. గుంటూరు కేంద్రంగా ఆదివారం సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగగా.. రాజకీయ నేతలు, విద్యార్థులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు మానవహారాలుగా ఏర్పడి, రాస్తారోకోలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిజ్రాల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించి .. కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మద్దతుదారుల సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, మంగళగిరిలో కూడా పలు సంఘాలు సమావేశాలు, నిరసన కార్యక్రమాల్ని చేపట్టాయి. విభజన తట్టుకోలేక.: తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న తమ బంధువుల్ని సీమాంధ్రకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండటాన్ని తట్టుకోలేక గుంటూరు, కోబాల్డ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ మంచుపల్లి వందనంబాబు(25) పురుగుమందు తాగగా శనివారం అర్ధరాత్రి దాటిన మృతిచెందాడు.
తెనాలికి చెందిన గోడపాటి నరసింహారావు(43) అనే పెయింటర్ సమైక్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ గుండెపోటుతో మరణించారు. వీరి మృతదేహాలను వైఎస్‌ఆర్ సీపీ నేతలు, జేఏసీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. గుంటూరులో విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్ అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు వందలాదిగా పాల్గొని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఐక్యత సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ధ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్‌లో ఉపాధ్యాయులు భారీ మానవహారం నిర్వహించి, రాష్ట్రాన్ని విభజిస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో జరగనున్న రాజీవ్ విద్యామిషన్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను బహిష్కరించాలని ఉపాధ్యాయ జేఏసీ పిలుపునిచ్చింది.
ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కార్యచరణ ప్రణాళిక
ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను సమీకరించి కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఎన్జీవో కల్యాణమండపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నుంచే ఏఎన్‌యూ విద్యార్థుల రిలే, ఆమరణ నిరాహారదీక్షలకు పూనుకోనున్నారు.
రాష్ట్ర విభజన నిరసన జ్వాలలు
Published Mon, Aug 5 2013 6:11 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement