సైబర్‌ వల.. యువత విలవిల | The Impact of Cyberbullying on Young Lives | Sakshi
Sakshi News home page

‘చెప్పుకోలేక.. తప్పుకోలేక’

Published Thu, Sep 21 2017 10:24 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

The Impact of Cyberbullying on Young Lives - Sakshi

దేశంలో పెరుగుతున్న సైబర్‌ బుల్లీయింగ్‌ బాధితులు
ఆత్మన్యూనతకు, కుంగుబాటుకు గురవుతున్న యువత
తల్లిదండ్రుల అప్రమత్తతే రక్ష అంటున్న నిపుణులు
చర్యలు తీసుకోవడానికి తగిన చట్టాలు లేవు

ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ఆ విద్యార్థిని, ఆమె తల్లి ఎంతగా బతిమిలాడినా వినిపించుకోడు. ఆమె తల్లితోనూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఆ ఆకతాయిని కొట్టి చంపుతుంది. ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాలోని సన్నివేశం. వర్తమాన ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న సైబర్‌ ముప్పును ఆ సన్నివేశం ప్రభావవంతంగా చూపించగలిగింది.  

విజయవాడకు చెందిన ఓ విద్యార్థిని కాలేజ్‌ ఫ్రెషర్స్‌ డే వేడుకలో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసింది. ఆమెకు బాగా తెలిసిన సహ విద్యార్థి ఆ ఫొటోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకర కామెంట్స్‌తో తన స్నేహితులకు షేర్‌ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది.

బ్లూ వేల్‌... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఆన్‌లైన్‌ గేమ్‌. ఈ వికృత క్రీడ యువత, విద్యార్థులను ఆత్మహత్యకు పురిగొల్పుతోంది.  

సాక్షి, అమరావతి :   ప్రస్తుతం పిల్లలు, యువత ఇలాంటి ఎన్నో సైబర్‌ బాధితులుగా మారుతున్నారు. మన ‘నెట్టిం’ట్లోకి.. తర్వాత స్మార్ట్‌ఫోన్‌ రూపంలో  అర చేతిలోకి ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చేసింది. నాణేనికి రెండు పార్శా్వలు ఉన్నట్టు ఇంటర్‌నెట్‌కు రెండు కోణాలు ఉన్నాయి. ఒక వైపు ఇంటర్‌నెట్‌ను చక్కగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో విషయాల్లో పరిజ్ఞానం పొందొచ్చు. విభిన్న విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చు. మరోవైపు నెట్‌ వేదికగా ఎన్నో మోసాలు, సైబర్‌ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా భవిష్యత్‌పైన దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. బ్లూవేల్‌ లాంటి ప్రమాదకరమైన ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  

ఆత్మన్యూనత.. కుంగుబాటు
సైబర్‌ బుల్లీయింగ్‌ విద్యార్థులు, యువత మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆత్మన్యూనతకు, కుంగుబాటు (డిప్రెషన్‌)కు గురవుతున్నారు. చదువుపై శ్రద్ధ పోతోంది. వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కుటుంబ, మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. వేధింపులు తీవ్రంగా ఉన్న కేసుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ ఆవహిస్తున్నాయి.  

వేధింపులు ఎక్కువ.. కేసులు తక్కువ
ఇంతగా సైబర్‌ బుల్లీయింగ్‌ పెరుగుతున్నా దేశంలో అధికారికంగా కేసులు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. వీటి గురించి తల్లిదండ్రులకు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు తెలిసినా గౌరవభంగమనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ సైబర్‌ బుల్లీయింగ్‌ నిందితులను శిక్షించడానికి దేశంలో తగిన చట్టం లేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పెళ్లి సంబంధం కుదిరిన ఓ యువతి ఫొటోలను ఆమె మద్యం తాగుతున్నట్లుగా ఓ ఆకతాయి మార్ఫింగ్‌ చేసి పోస్టు చేశాడు. దాంతో మగపెళ్లివారు ఆ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సరైన చట్టం లేకపోవడంతో ఆ ఆకతాయిని శిక్షించలేకపోయారు.
 
రాజకీయ దుర్వినియోగమే శాపం  
ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపునకు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను దుర్వినియోగం చేశాయి. అందుకే శ్రేయా సింఘాల్‌ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని 2015లో కొట్టేసింది. బాలలు, యువతపై సైబర్‌ బుల్లీయింగ్‌ వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చొరవ చూపకపోవడం వల్ల సైబర్‌ బుల్లీయింగ్‌కు పాల్పడేవారిని శిక్షించలేకపోతున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.  

అప్రమత్తత.. అవగాహన..  
పిల్లలు ఆన్‌లైన్‌ వేధింపులకు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఇంటి వాతావరణాన్ని అహ్లాదంగా ఉంచాలి. సామాజిక మాధ్యమాల్లో పిల్లల వ్యవహారాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆన్‌లైన్‌ వేధింపులపై వారికి తగిన అవగాహన కల్పించాలి. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ తదితర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లకు సరైన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సైబర్‌ బుల్లీయింగ్‌కు గురైతే వెంటనే తమకు తెలపాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. అవసరమైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.  

తల్లిదండ్రుల అప్రమత్తతే శ్రీరామరక్ష
పిల్లలు సైబర్‌ బుల్లీయింగ్‌కు గురయ్యారనే విషయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు గుర్తించడం లేదు. పిల్లలు డల్‌గా ఉంటున్నారు, సరిగా చదవడం లేదని మా వద్దకు తీసుకువస్తున్నారు. వారిని విచారిస్తే తాము సైబర్‌ బుల్లీయింగ్‌కు గురయ్యామని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అభ్యంతరకరమైన సైట్లు చూడకుండా జాగ్రత్త పడాలి. ఐడెంటిటీనీ గోప్యంగా ఉంచే సైట్లు ప్రమాదకరమైనవి. వాటికి దూరంగా ఉండాలి. అభ్యంతర సంభాషణలు, పోస్టులకు పిల్లలు స్పందించకూడదు. వారు ఒకసారి స్పందిస్తే ఇక వారిని వెంటాడి వేధిస్తారు. సైబర్‌ బుల్లీయింగ్‌కు గురైనవారు తామేదో తప్పు చేశామనే ఆత్మన్యూనతకు గురికాకూడదు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి ఆ సమస్య నుంచి బయటపడాలి.– డాక్టర్‌ ఇండ్ల విశాల్, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ

సైబర్‌ బుల్లీయింగ్‌ అంటే..
ఎలక్ట్రానిక్‌ సమాచార వ్యవస్థ అంటే... ఈమెయిళ్లు, సామాజిక మాధ్యమాలు, టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా ఇతరులకు హాని, బాధ కలిగించడమే సైబర్‌ బుల్లీయింగ్‌. కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు ఆన్‌లైన్‌ ద్వారా లైంగిక వాంఛలు వ్యక్తీకరించి వేధిస్తుంటారు. ఇంకొందరు కొన్ని లింకులు పంపిస్తారు. వాటిపై క్లిక్‌ చేస్తే అసభ్యకర సందేశాలు, చిత్రాలు వస్తాయి. ఫొటోల మార్ఫింగ్‌ చేసి, సంభాషణలను ఎడిట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. ఇలా చేస్తామని బెదిరిస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా సైబర్‌ బుల్లీయింగ్‌ కిందకు వస్తాయి.

విస్తరిస్తున్న సైబర్‌ బుల్లీయింగ్‌  
సిమన్‌టెక్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్,  కెనడా, బ్రెజిల్, ఇటలీ, యూఏఈ, చైనా, జపాన్, ఆస్ట్రేలియాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 13 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వారిని సర్వే చేశారు. వారిలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మన దేశంలో మెట్రోపాలిటన్‌ నగరాలతోపాటు చిన్న నగరాల్లోనూ సర్వే నిర్వహించారు. భారతదేశంలో సర్వే చేసిన నగరాల్లో 52 శాతం మంది పిల్లలు తాము ఎంతో కొంత సైబర్‌ బుల్లీయింగ్‌ బారినపడ్డామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 30 శాతం మంది సైబర్‌ బుల్లీయింగ్‌ బాధితులేనని వెల్లడైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement