Online harassment
-
HYD: ‘గుంటూరు పోకిరి’ గణేష్‌పై పీడీ యాక్ట్
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియాలో యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ఓ యువకుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ గణేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో ఛాటింగ్ చేసేవాడు. హ్యాకింగ్ స్కాం , ఇంటర్ ది డ్రాగన్ , కింగ్ ఈజ్ బ్యాక్ , తేజ రౌడీ పేరు తో గ్రూప్‌లు, ఐడీలు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్ నెంబర్లు సైతం సంపాదించి వేధించడం చేయడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు, ఎమోజీలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన లక్ష్మీ గణేష్.. పోకిరిగా, జులాయిగా తిరుగుతూ వస్తున్నాడు. చాలాకాలంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓ యువతి ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో ఉన్నాడు. తిరిగి విడుదల అయ్యాక కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరో మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. పీడీ యాక్ట్ విధించి కటకటాల వెనక్కి నెట్టారు రాచకొండ పోలీసులు. -
రెండేళ్లుగా అమృతపై అసభ్యకరమైన కామెంట్లు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఈ పని చేస్తూ వస్తోంది. చివరకు సైబర్ పోలీసుల జోక్యంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లింది. అమృత ఫడ్నవిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్నది తెలిసిందే. అయితే.. స్మృతి పాంచోల్ అనే మహిళ గత రెండేళ్లుగా రకరకాల అకౌంట్లతో అమృత ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లలో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ వస్తోంది. సుమారు 50 ఏళ్ల వయసున్న నిందితురాలు.. గత రెండేళ్లలో ఆమె 53 ఫేక్ ఎఫ్బీ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు వాడినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఐపీసీ 419, 468 సెక్షన్ల ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం నిందితురాలు కోర్టు రిమాండ్‌లో ఉండగా.. అసలు ఆమె అలా చేయడానికి కారణాలేంటి? ఆమె వెనుక ఎవరున్నారనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదీ చదవండి: స్నేక్‌మ్యాన్ వినోద్.. పాపం కళ్ల ముందే కుప్పకూలాడు -
నీకు అవకాశాలు రావాలంటే ఈ పాడు పనులు తప్పవులే అంటూ
కోల్‌కతా: ‘‘ఆ దర్శకుడితో డేటింగ్లో ఉన్నందుకే నీకు ఆఫర్లు వస్తున్నాయి. లేదంటే నువ్వు ‘కమిట్మెంట్’ ఇస్తేనే తప్ప నిన్ను ఎవరు సీరియల్లో పెట్టుకుంటారు. నీలాంటి మేని ఛాయ ఉన్నవాళ్లకు అవకాశాలు రావాలంటే అలాంటి పాడు పనులు తప్పవులే’’... బెంగాలీ నటి శృతిదాస్పై కొంతమంది నెటిజన్ల విద్వేషపు కామెంట్లు ఇవి. ప్రస్తుతం ఆమె.. ‘దశేర్ మాతీ’ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శృతితో పాటు పాయల్ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్ రెచ్చిపోతున్నారు. గత రెండేళ్లుగా ఆమెపై విద్వేష విషం కక్కుతూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన శృతి... ఆన్లైన్లో తనకు వస్తున్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘బ్లాక్ బోర్డు, నలుపు అమ్మాయి.. ఇలాంటి పేర్లతో నన్ను వేధించడం కొంతమందికి పనిగా మారింది. అసలు నీలాంటి వారిని హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు లీడ్‌రోల్స్ కోసం నేను దర్శకులతో ‘రాజీ’ కుదుర్చుకుంటున్నానని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మరికొంత మందేమో... స్వర్నేందు(బెంగాలీ సీరియల్ డైరెక్టర్)తో రిలేషన్షిప్లో ఉన్నందు వల్లే ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్నీ నిజం కావు. నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరో రికమెండ్ చేస్తేనో, లేదంటే ‘మరో’ విధంగానో నేను అవకాశాలు దక్కించుకోవడం లేదు. ప్రేక్షకులు ఆదరించకపోతే.. ఎవరూ ఏం చేయలేరు. నా కారణంగా నష్టపోవడానికి సిద్ధపడరు. గత రెండేళ్లుగా నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే నిన్ననే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా త్రినయని సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి దాస్.. ప్రస్తుతం దశర్ మాతీ సీరియల్లో.. టీచర్‌గా నటిస్తున్నారు. -
హద్దు దాటి కామెంట్ చేస్తే కటకటాలే..
ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసి కొత్తగూడకు చెందిన సర్పంచ్ అరెస్టు అయ్యారు. అలాగే గతంలోనూ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియనాయక్పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతర కర వాఖ్యలు చేసి పలువురు అరెస్టయ్యారు. రాజకీయ నేతలతో పాటు, సాధారణ ప్రజానీకంలోని మహిళలు, ఇతర వ్యక్తుల పట్ల అనుచిత ప్రవర్తన చేసి కేసులపాలైన వారు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నారు. చేతిలో మొబైల్ ఉందని హద్దుమీరితే శిక్షల నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, మహబూబాబాద్: నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ప్రధాన భాగమైన ఫేస్బుక్, వాట్సప్ లాంటి యాప్‌లు ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు. దీంతో ఇందులో రాజకీయ నేతలతో పాటు, సామాన్య ప్రజానీకం భాగస్వాములై తమ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసుకొని తమకు సంబంధించిన ఆంశాలను ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే జిల్లాలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించ పరుస్తూ, అసభ్యకరమైన పోస్టింగ్‌లతో కేసులపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ ని ఎవరూ చూడటం లేదని హద్దుమీరి పోస్టింగ్‌లు, కామెంట్లతో రెచ్చిపోతున్న వారి సంఖ్య అధికమవుతుంది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారిలో కొద్ది మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరి కొందరు ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, మరికొందరు అందరికీ తెలిస్తే పరువుపోతుందని ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. కామెంట్లు.. కౌంటర్లు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో, దాదాపు అన్ని పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాలను పార్టీ నాయకులే కాకుండా, పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లో వివిధ పేర్లతో వాట్సప్ గ్రూప్స్, ఫేస్‌బుక్‌లలో పేజీలు క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో ఆయా పార్టీల నేతలు సభలు, సమావేశాల్లో నేరుగా ప్రత్యర్థుల పై విమర్శలు, ఆరోపణలు చేసేవారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలోనే కాకుండా, మామూలు సమయంలో సైతం తమ పార్టీ నిర్ణయాలను, తమ నాయకుడు చేసిన పనులు, వాగ్దానాలు ఇతర ఆంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీల నేతలు పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఆయా పార్టీల ఫాలోవర్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతూ.. తమ పార్టీ నేతల గుణగణాలు, ఎదుటివాళ్ల లోపాలనూ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఐదేళ్ల కిందట ఇలా ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం. ఈ ఘనత మా నేతదే.. ఇలాంటివి ఎన్నో చేశాం.. ఇక ముందు మరెన్నో చేస్తాం.. ఇప్పటికైనా అభివృద్ధికి చేయాతనివ్వండి.. అంటూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత పార్టీ అనుచరులు జయహో.. అంటుంటే, ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక కామెంట్లు విసురుతున్నారు. ఇవి కొన్ని సందర్భాల్లో కట్టు తప్పి, వ్యక్తిగత విమర్శలకు దారితీస్తూ అదుపుతప్పుతున్నాయి. అదుపు తప్పుతున్నాయ్.. విమర్శలకైనా.. ఆరోపణలకైనా.. ఒక హద్దు ఉంటుంది. ప్రత్యర్థిపై దాడి చేసే ముందు సంబంధిత అంశానికి సంబంధించిన ఆధారం కూడా ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చాలా మంది ఇష్టానుసారంగా కామెంట్లు, కౌంటర్లు, షేర్లు చేస్తున్నారు. ఇది కాస్తా విషమంగా మారుతుంది. మునిసిపాలిటీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో సోషల్ మీడియాలో మరింత రచ్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటి పై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి చట్ట ప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలతో... ఒకరి హక్కులకు భంగం కలిగించేలా ఇంటర్నెట్లో ప్రచారం చేస్తే బాధ్యుల పై ఐటీ చట్టం 66సీ, 66డీ, 67 కింద కేసులు నమోదు చేస్తారు. మహిళల పై వేధింపులకు దిగితే ఐపీసీ 509(మహిళల గౌరవానికి భంగం కలిగించడం), 354(ఏ,బీ,సీ,డీ) నిర్భయ చట్టాల కింద కటకటాల్లోకి పంపుతారు. అలాగే ఐపీసీ 292, 294 చట్టాల కింద కేసులు తప్పవు. కటకటాల పాలైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చిక్కులు తప్పవు. కార్పొరేట్, స్టాప్‌వేర్ లాంటి పెద్ద కంపెనీల కొలువుల్లోనూ ప్రవర్తన పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. జాగ్రత్తగా ఉండాలి సామాజిక మాద్యమాల ద్వారా అభ్యంతరకరమైన, మనోభావాలను దెబ్బతీసేలా, శాంతికి విఘాతం కలిగించేలా ఉన్న పోస్టులు చేయొద్దు. అలాగే వాటిని షేర్ చేయడం, కామెంట్ చేయవద్దు. ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాం. అలాగే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హద్దు మీరితే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలు పాటించి అందరూ ఉపయోగపడేవి షేర్ చేయాలి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
సైబర్ కీచకుల ఆటకట్టు
ఫేస్బుక్లో సరదాగా పోస్టు చేసిన ఫ్యామిలీ ఫొటోలోని ఆమె ముఖాన్ని కాపీ చేసి అసభ్య చిత్రాలకు జత (మార్ఫింగ్) చేశాడు ఒక సైబర్ కీచకుడు. తాను చెప్పినట్టు చేయకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని విశాఖకు చెందిన ఓ యువతిపై వేధింపులకు దిగాడు. మీరు అందంగా ఉంటారు. మిమ్మల్ని కలవాలనుంది అంటూ వాట్సాప్ చాటింగ్ ద్వారా గుంటూరుకు చెందిన ఓ వివాహితపై అసభ్య పదజాలంతో మరో పోకిరీ ఆగడాలు.. .. ఇలా రాష్ట్రంలో మహిళలే లక్ష్యంగా ‘సైబర్’ కీచకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇలాంటి వారి పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ‘సైబర్ మిత్ర’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. మహిళలు, బాలికల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపడంతోపాటు ‘సైబర్’ కీచకుల ఆటకట్టించే చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ‘సైబర్‌మిత్ర’ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీనిపై మహిళలు, చిన్నారుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెలగపూడి, విశాఖపట్నం, విజయవాడలో ఈ సదస్సులు జరిగాయి. –సాక్షి, అమరావతి మూడేళ్లలో కేసులు రెట్టింపు సామాజిక మాధ్యమాల కారణంగా మహిళలు చైతన్యంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పోలీసు రికార్డులకెక్కుతున్న సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. 2016లో మహిళలపై వేధింపులకు సంబంధించి 160 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు 291 నమోదయ్యాయి. ఇలా వేధింపులకు గురవుతున్న వారిలో 70 శాతం మంది 20 ఏళ్లలోపు యువతులే కావడం గమనార్హం. కాగా, ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఓ వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఈ నెంబర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ఇలా ఫిర్యాదు చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు కూడా. ఇవీ జాగ్రత్తలు.. - అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వాట్సాప్ చాటింగ్లకు స్పందించకుండా ఉంటే మేలు. - ఫోన్లకు సోషల్ మీడియా ద్వారా అపరిచితులు పంపే లింకులను ఓపెన్ చేయకూడదు. దీనివల్ల మన ఫోన్‌ను హ్యాక్‌చేసి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు చోరీచేసే ప్రమాదం ఉంది. - యాప్‌లు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకూడదు. - సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులు ఫొటోలు అప్లోడ్ చేయకపోవడం మంచిది. - అపరిచితులకు ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను షేర్ చేయకూడదు. అప్రమత్తతే మహిళలకు ప్రాథమిక రక్షణ సామాజిక మాధ్యమాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలి. ఫొటోలు షేర్ చేయడం, పోస్టు చేయడం వంటి విషయాల్లో సాంకేతిక భద్రత అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవే ఫొటోలను సైబర్ నేరగాళ్లు తీసుకుని అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడొచ్చు. బాధితులు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం.. విశాఖపట్నం, విజయవాడలలో ఉన్న సైబర్ పోలీస్స్టేషన్లతోపాటు, ఇతర పోలీస్స్టేషన్లు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. – మేరీ ప్రశాంతి, ఎస్పీ, సైబర్ మిత్ర వింగ్ ఇంట్లో నుంచే ఫిర్యాదు చెయ్యొచ్చు ఆన్లైన్ వేధింపులకు పాల్పడే సైబర్ నేరగాళ్లపై బాధిత మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే వాట్సాప్ నెంబర్ 9121211100 ఫిర్యాదు చెయ్యొచ్చు. ఈ నెంబర్‌కు రోజుకు సగటున 23–27 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాట్సాప్, ఈ–మెయిల్, ఇంటర్నెట్, తదితర అన్ని ఆన్లైన్ వేధింపులపైన ఐటీ యాక్ట్–2000 ప్రకారం, ఐపీసీ సెక్షన్లపై కేసులు నమోదు చేస్తున్నాం. – కేజీవీ సరిత, ఏఎస్పీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ -
మార్ఫింగ్ ఫొటోలతో అశ్లీల చాటింగ్..!
సాక్షి, వరంగల్: సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలతో ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్‌కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు... అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు. ధర్మారం వాసి... వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి(మైనర్) ఇన్‌స్టాగ్రాంలోని యువతల ఫొటోలను సేకరిస్తున్నాడు. ఆ తర్వాత అశ్లీలకరమైన ఫొటోతో మార్ఫింగ్ చేసి ఆ ఫొటో ద్వారా నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతా ద్వారా తనతో అశ్లీలకరంగా చాటింగ్ చేయాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను తన కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని బెదిరిస్తూనే మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోను కాలేజీకి సంబంధించిన గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న సదరు యువతి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి యువతల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని మట్టెవాడ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిర్యాదు అందుకున్న అతితక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, మట్టెవాడ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్‌తో పాటు ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్‌కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్‌ను సీపీ రవీందర్ అభినందించారు. -
మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ స్నేహితురాలిని ఆన్లైన్లో వేధించిన కేసులో నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న గణేష్ గతంలో కాచిగూడలోని ఆస్పత్రిలో పని చేశాడు. అప్పట్లో పరిచయమైన సహోద్యోగినితో స్నేహం చేశాడు. ఆ సందర్భంలో కొన్ని ఫొటోలు సేకరించి భద్రపరుచుకున్నాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు చోట్ల స్థిరపడిన తర్వాత ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన అతను తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అభ్యంతరకరమైన ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
43% మంది స్త్రీలకే మొబైల్ ఫోన్లు
మన దేశంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న స్త్రీల శాతం తక్కువే. 43% మంది స్త్రీలకు మాత్రమే ఇక్కడ మొబైల్ ఫోన్లు వున్నాయి. ఫోన్లు ఉపయోగిస్తున్న పురుషుల సంఖ్య దాదాపు ఇందుకు రెట్టింపు సంఖ్యలో (80%) వుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ర్వాండా సహా 18 దేశాలపై ‘లిర్న్‌ఆసియా’ (లెర్నింగ్ ఇనిషియేటివ్స్ ఆన్ రిఫార్మ్స్ ఫర్ నెట్వర్క్ ఎకానమీస్ ఆసియా) జరిపిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం – ఫోన్ల వాడకంలో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశ మహిళలు బాగా వెనకబడ్డారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఇంకా వెనకున్నారు. ఇంటర్నెట్ వాడకంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం (57%) మరింత ఎక్కువగా వుంది. అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు సర్వే విశ్లేషకులు. గ్రామీణులు (55%) కంటే పట్టణవాసులే ( 71%) ఎక్కువగా ఫోన్లు వాడుతున్నారని సర్వే వెల్లడించింది. మన దేశంలో మొత్తం 5000 మందిని ‘లిర్న్ఏషియా’ ఇంటర్వూ్య చేసింది. వీరిలో ఇంటర్నెట్ వాడకందార్లు 919 మంది మాత్రమే. సర్వే వెల్లడించిన ఆసక్తికర విషయాలు కొన్ని : సోషల్ మీడియా వార్తలపై అపనమ్మకం దేశంలో నెట్ వాడకందార్లు 19% మాత్రమే. ఈ విషయంలో నైజీరియా, ఘనా, కెన్యా, కంబోడియా కంటే మనం వెనకబడ్డాం. 64% మందికి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదు. ఈ విషయంలో పాకిస్థాన్ (69%) బంగ్లాదేశ్ (67%)లు మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నెట్ గురించి తెలియని వారిలో స్త్రీలు (68%) గ్రామీణులే (68%) ఎక్కువ. స్మార్ట్ ఫోన్ వాడకందార్లలో 35% మందికి ఇంటర్నెట్ గురించి తెలియదు. సోషల్ మీడియా (27%) కోసం ఎక్కువ మంది నెట్ వాడుతున్నారు. వినోదం (16%) వార్తల (15%) కోసం నెట్‌తో అనుసంధానమవుతున్న వారు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మార్కెటింగ్, విద్యా సంబంధిత సమాచారం కోసం సోషల్ మీడియాలో వున్న స్త్రీల శాతం మన దగ్గర ఎక్కువే. పురుషులు మాత్రం ప్రధానం చాటింగ్ కోసమే సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. దేశంలో అత్యధికులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను విశ్వసించడం లేదు. ఆ వార్తల్ని నమ్మేవారు 29% మంది మాత్రమే. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పోల్చుకుంటే మనవాళ్లకి ఈ – కామర్స్ గురించిన అవగాహన ఎక్కువే. అయితే, మొబైల్‌తో నగదు లావాదేవీలు జరుపుతున్నవారు 6% మంది మాత్రమే. ఆన్లైన్ వేధింపులు.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఆన్లైన్ వేధింపు బాధితులే. 15 – 65 వయస్కుల్లో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ (12%) కంటే భారత్‌లోనే ఎక్కువమంది (19%) వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా చేదు అనుభవాలు మూట గట్టుకుంటున్న వారిలో పట్టణవాసులతో (17%)తో పోల్చుకుంటే గ్రామీణులే (20%) ఎక్కువ. స్త్రీల (17%) కంటే పురుషులు (20%) మరింతగా వేధింపుల బారిన పడుతున్నారు. 38% మందికి వేధింపుల వెనుక కారణాలేమిటో తెలియదు. జండర్ / మతం / రాజకీయాలు వేధింపులకు కారణమని 20% మంది భావిస్తున్నారు. 7% మంది ఆన్లైన్ గేమింగ్ / 29% మంది చాటింగ్ సందర్భంలో వేధింపుల బారిన పడుతున్నారు. వెబ్సైట్లో చేసిన కామెంట్లు 16% మందిని చికాకుపరిచాయట! వేధింపులకు గురైన వారిలో దాదాపు సగం మంది (48%) వాటిని అంతగా పట్టించుకోలేదని చెప్పారు. 28% మంది మాత్రం సంబంధిత వెబ్‌సైట్‌కు కేటాయించే సమయాన్ని తగ్గించేశారట. కొందరయితే (15%) సంబంధిత యాప్‌నే తొలగించేశారట. 5% మంది వేధించే వాళ్లతో సంబంధాలను కత్తిరించేసుకోవడం /æ కాంటాక్ట్‌ను బ్లాక్ చేసేయడం / సంబంధిత గ్రూప్ లేదా ఫోరమ్ నుంచి బయటకొచ్చేయడం ద్వారా తలనొప్పులు తగ్గించుకున్నారు. -
వేధింపులను అరికట్టే ఫేస్బుక్ టూల్స్
హూస్టన్: మహిళలపై ఆన్లైన్ వేధింపులను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆకతాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు రాకుండా ఈ కొత్త ఫీచర్లు అడ్డుకుంటాయి. ఢిల్లీకి చెందిన, మహిళా సాధికారత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్’తో కలసి ఫేస్బుక్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఐపీ అడ్రస్‌లు ఇతర సంకేతాలను ఉపయోగించడం ద్వారా నకిలీ ఖాతాలను గుర్తించి ఫేస్బుక్ వాటిని డీయాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎవరైనా సందేశాలు పంపి విసిగిస్తున్నప్పుడు దానిని అనవసర సందేశం (అన్వాంటెడ్ మెసేజ్) అని మార్క్ చేస్తే ఇకపై ఆ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు రావు. అవన్నీ ఒక ప్రత్యేక ఫోల్డర్లో సేవ్ అయ్యుంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వినియోగదారులు వాటిని చదివినా అవతలి వ్యక్తికి ఆ విషయం తెలియదు. -
సైబర్ వల.. యువత విలవిల
♦దేశంలో పెరుగుతున్న సైబర్ బుల్లీయింగ్ బాధితులు ♦ఆత్మన్యూనతకు, కుంగుబాటుకు గురవుతున్న యువత ♦తల్లిదండ్రుల అప్రమత్తతే రక్ష అంటున్న నిపుణులు ♦చర్యలు తీసుకోవడానికి తగిన చట్టాలు లేవు ►ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ విద్యార్థిని, ఆమె తల్లి ఎంతగా బతిమిలాడినా వినిపించుకోడు. ఆమె తల్లితోనూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఆ ఆకతాయిని కొట్టి చంపుతుంది. ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాలోని సన్నివేశం. వర్తమాన ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న సైబర్ ముప్పును ఆ సన్నివేశం ప్రభావవంతంగా చూపించగలిగింది. ►విజయవాడకు చెందిన ఓ విద్యార్థిని కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసింది. ఆమెకు బాగా తెలిసిన సహ విద్యార్థి ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర కామెంట్స్‌తో తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. ►బ్లూ వేల్... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఆన్లైన్ గేమ్. ఈ వికృత క్రీడ యువత, విద్యార్థులను ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. సాక్షి, అమరావతి : ప్రస్తుతం పిల్లలు, యువత ఇలాంటి ఎన్నో సైబర్ బాధితులుగా మారుతున్నారు. మన ‘నెట్టిం’ట్లోకి.. తర్వాత స్మార్ట్‌ఫోన్ రూపంలో అర చేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. నాణేనికి రెండు పార్శా్వలు ఉన్నట్టు ఇంటర్నెట్కు రెండు కోణాలు ఉన్నాయి. ఒక వైపు ఇంటర్నెట్ను చక్కగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో విషయాల్లో పరిజ్ఞానం పొందొచ్చు. విభిన్న విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చు. మరోవైపు నెట్ వేదికగా ఎన్నో మోసాలు, సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా భవిష్యత్‌పైన దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్నారు. బ్లూవేల్ లాంటి ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మన్యూనత.. కుంగుబాటు సైబర్ బుల్లీయింగ్ విద్యార్థులు, యువత మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆత్మన్యూనతకు, కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతున్నారు. చదువుపై శ్రద్ధ పోతోంది. వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కుటుంబ, మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. వేధింపులు తీవ్రంగా ఉన్న కేసుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ ఆవహిస్తున్నాయి. వేధింపులు ఎక్కువ.. కేసులు తక్కువ ఇంతగా సైబర్ బుల్లీయింగ్ పెరుగుతున్నా దేశంలో అధికారికంగా కేసులు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. వీటి గురించి తల్లిదండ్రులకు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు తెలిసినా గౌరవభంగమనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ సైబర్ బుల్లీయింగ్ నిందితులను శిక్షించడానికి దేశంలో తగిన చట్టం లేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పెళ్లి సంబంధం కుదిరిన ఓ యువతి ఫొటోలను ఆమె మద్యం తాగుతున్నట్లుగా ఓ ఆకతాయి మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దాంతో మగపెళ్లివారు ఆ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సరైన చట్టం లేకపోవడంతో ఆ ఆకతాయిని శిక్షించలేకపోయారు. రాజకీయ దుర్వినియోగమే శాపం ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపునకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను దుర్వినియోగం చేశాయి. అందుకే శ్రేయా సింఘాల్ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని 2015లో కొట్టేసింది. బాలలు, యువతపై సైబర్ బుల్లీయింగ్ వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చొరవ చూపకపోవడం వల్ల సైబర్ బుల్లీయింగ్‌కు పాల్పడేవారిని శిక్షించలేకపోతున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. అప్రమత్తత.. అవగాహన.. పిల్లలు ఆన్లైన్ వేధింపులకు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఇంటి వాతావరణాన్ని అహ్లాదంగా ఉంచాలి. సామాజిక మాధ్యమాల్లో పిల్లల వ్యవహారాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆన్లైన్ వేధింపులపై వారికి తగిన అవగాహన కల్పించాలి. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు సరైన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సైబర్ బుల్లీయింగ్‌కు గురైతే వెంటనే తమకు తెలపాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. అవసరమైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. తల్లిదండ్రుల అప్రమత్తతే శ్రీరామరక్ష పిల్లలు సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యారనే విషయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు గుర్తించడం లేదు. పిల్లలు డల్‌గా ఉంటున్నారు, సరిగా చదవడం లేదని మా వద్దకు తీసుకువస్తున్నారు. వారిని విచారిస్తే తాము సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యామని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అభ్యంతరకరమైన సైట్లు చూడకుండా జాగ్రత్త పడాలి. ఐడెంటిటీనీ గోప్యంగా ఉంచే సైట్లు ప్రమాదకరమైనవి. వాటికి దూరంగా ఉండాలి. అభ్యంతర సంభాషణలు, పోస్టులకు పిల్లలు స్పందించకూడదు. వారు ఒకసారి స్పందిస్తే ఇక వారిని వెంటాడి వేధిస్తారు. సైబర్ బుల్లీయింగ్‌కు గురైనవారు తామేదో తప్పు చేశామనే ఆత్మన్యూనతకు గురికాకూడదు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి ఆ సమస్య నుంచి బయటపడాలి.– డాక్టర్ ఇండ్ల విశాల్, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ సైబర్ బుల్లీయింగ్ అంటే.. ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థ అంటే... ఈమెయిళ్లు, సామాజిక మాధ్యమాలు, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఇతరులకు హాని, బాధ కలిగించడమే సైబర్ బుల్లీయింగ్. కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు ఆన్లైన్ ద్వారా లైంగిక వాంఛలు వ్యక్తీకరించి వేధిస్తుంటారు. ఇంకొందరు కొన్ని లింకులు పంపిస్తారు. వాటిపై క్లిక్ చేస్తే అసభ్యకర సందేశాలు, చిత్రాలు వస్తాయి. ఫొటోల మార్ఫింగ్ చేసి, సంభాషణలను ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తామని బెదిరిస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా సైబర్ బుల్లీయింగ్ కిందకు వస్తాయి. విస్తరిస్తున్న సైబర్ బుల్లీయింగ్ సిమన్టెక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్, ఇటలీ, యూఏఈ, చైనా, జపాన్, ఆస్ట్రేలియాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 13 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వారిని సర్వే చేశారు. వారిలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మన దేశంలో మెట్రోపాలిటన్ నగరాలతోపాటు చిన్న నగరాల్లోనూ సర్వే నిర్వహించారు. భారతదేశంలో సర్వే చేసిన నగరాల్లో 52 శాతం మంది పిల్లలు తాము ఎంతో కొంత సైబర్ బుల్లీయింగ్ బారినపడ్డామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 30 శాతం మంది సైబర్ బుల్లీయింగ్ బాధితులేనని వెల్లడైంది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్: ప్రేమ నిరాకరించిన అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాళ్లకు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది నుంచి గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని మణికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నూకటి సురేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి కథనం ప్రకారం... నూకటి సురేశ్ బాధితురాలైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బాధితురాలి ఫేస్‌బుక్‌తో పాటు ఆమె ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఖాతాలోకి వెళ్లి బాధితురాలి ఫొటోలను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి బాధితురాలితో పాటు ఆమె స్నేహితులకు వాట్సాప్‌కు పంపాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోలతో పాటు వాట్సాప్ నంబర్ పోస్టు చేశాడు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
సెరిలాక్ వయసులోనే.. సెల్ఫోన్లా!
► నెట్వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాలతో పక్కదారి ► దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఆన్లైన్ వేధింపుల నిందితులు ► ‘ఆన్లైన్లో లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సులో వక్తలు ► సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తాం: హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: సెరిలాక్ తినాల్సిన వయసులోనే సెల్ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులకు ఆన్లైన్లో లైంగిక వేధింపులు మొదలయ్యాయని, నెట్వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాతో పక్కదారి పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ‘ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సును హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారం భించారు. టెక్నాలజీ, సోషల్ మీడియాలను సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్లే చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నారు లపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సైబర్ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రసంశిం చారు. ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో నియంత్రణ పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైం గిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లి దండ్రులదేనని తులిర్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్ ఎడ్యు కేషన్ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్లోడ్ చేసినట్లు అక్కడి పోలీసుల దర్యా ప్తులో బయటపడిందన్నారు. దీంతో అక్కడ వైఫై సేవలు రద్దు చేశారన్నారు. పోర్న్ వెబ్ సైట్లు, సంబంధిత సోషల్ మీడియాను వీక్షిం చవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపి స్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి వెబ్సైట్లు వీక్షించడం వల్ల వచ్చే ప్రమాదాలను తెలపడం, అవగాహన కల్పించడం వల్ల, పిల్లల్లో స్వీయ నియంత్రణ అలవ డుతుందని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించ గలరని పేర్కొన్నారు. -
సైబర్ పోకిరీకి అరదండాలు
హైదరాబాద్: అమెరికాలో పీహెచ్డీ చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వివాహితను ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న సైబర్ పోకిరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలు కేవలం ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణం స్పందించిన అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని కటకటాల్లోకి పంపడం విశేషం. మహారాష్ట్రలోని సాంఘ్లీ ప్రాంతానికి చెందిన వివాహిత 2007లో హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో (ఇఫ్లూ) ఫ్రెంచ్ భాషలో పీజీ చేశారు. ఆ సమయంలో రిఫరెన్స్ కోసం తరచూ ఇఫ్లూ లైబ్రరీకి వెళ్ళేవారు. అప్పట్లో ఉస్మానియాలో ఇంగ్లీష్‌లో ఎంఫిల్ చేస్తున్న వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన దేవతల మనోహర్ డేవిడ్ మాథ్యూస్ ఇఫ్లూ లైబ్రరీలో ఆమెను చూసి ఇతరుల ద్వారా పేరు తెలుసుకున్నాడు. కాగా సదరు మహిళకు అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్డీ (ఫ్రెంచ్ సాహిత్యం) చేసే అవకాశం రావడంతో అక్కడకు వెళ్ళారు. డేవిడ్ మాథ్యూస్ విద్యాభ్యాసం తర్వాత ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బోధకుడిగా చేరాడు. ఇఫ్లూ లైబ్రరీలో కనిపించిన ఆమె ఆపై కనిపించకపోవడంతో ఆమె కోసం ‘వెతకడం’ ప్రారంభించాడు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ లో ఆ వివాహిత పేరుతో భారీ సెర్చ్ చేసిన డేవిడ్ మాథ్యూస్ చివరకు ఆర్కూట్ ద్వారా ఆమె మెయిల్ ఐడీ తెలుసుకున్నాడు. దీనికి తన మెయిల్ ఐడీ నుంచి దాదాపు 200 అసభ్యకర, అభ్యంతరకర సందేశాలు పంపాడు. తనతో స్నేహం చేయాలని, హైదరాబాద్ వచ్చి సన్నిహితంగా ఉండాలని బెదిరించాడు. తాను వివాహితనని, తనకు స్నేహం చేసే ఆసక్తి లేదని ఆమె నుంచి బదులు రావడంతో డేవిడ్ మాథ్యూస్ మరింత రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈ నెల ఏడున ఈ–మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సంయుక్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరామ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉంటున్న డేవిడ్ మాథ్యూస్ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ పోకిరి బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే 9490617347 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.