ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసి కొత్తగూడకు చెందిన సర్పంచ్ అరెస్టు అయ్యారు. అలాగే గతంలోనూ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతర కర వాఖ్యలు చేసి పలువురు అరెస్టయ్యారు. రాజకీయ నేతలతో పాటు, సాధారణ ప్రజానీకంలోని మహిళలు, ఇతర వ్యక్తుల పట్ల అనుచిత ప్రవర్తన చేసి కేసులపాలైన వారు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నారు. చేతిలో మొబైల్ ఉందని హద్దుమీరితే శిక్షల నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సాక్షి, మహబూబాబాద్: నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ప్రధాన భాగమైన ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి యాప్‌లు ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు. దీంతో ఇందులో రాజకీయ నేతలతో పాటు, సామాన్య ప్రజానీకం భాగస్వాములై తమ పేరుతో అకౌంట్‌లు ఓపెన్ చేసుకొని తమకు సంబంధించిన ఆంశాలను ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే జిల్లాలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించ పరుస్తూ, అసభ్యకరమైన పోస్టింగ్‌లతో కేసులపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ ని ఎవరూ చూడటం లేదని హద్దుమీరి పోస్టింగ్‌లు, కామెంట్‌లతో రెచ్చిపోతున్న వారి సంఖ్య అధికమవుతుంది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారిలో కొద్ది మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరి కొందరు ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, మరికొందరు అందరికీ తెలిస్తే పరువుపోతుందని ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు.
కామెంట్లు.. కౌంటర్లు
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో, దాదాపు అన్ని పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాలను పార్టీ నాయకులే కాకుండా, పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లో వివిధ పేర్లతో వాట్సప్ గ్రూప్స్, ఫేస్‌బుక్‌లలో పేజీలు క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో ఆయా పార్టీల నేతలు సభలు, సమావేశాల్లో నేరుగా ప్రత్యర్థుల పై విమర్శలు, ఆరోపణలు చేసేవారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలోనే కాకుండా, మామూలు సమయంలో సైతం తమ పార్టీ నిర్ణయాలను, తమ నాయకుడు చేసిన పనులు, వాగ్దానాలు ఇతర ఆంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీల నేతలు పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఆయా పార్టీల ఫాలోవర్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతూ.. తమ పార్టీ నేతల గుణగణాలు, ఎదుటివాళ్ల లోపాలనూ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఐదేళ్ల కిందట ఇలా ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం. ఈ ఘనత మా నేతదే.. ఇలాంటివి ఎన్నో చేశాం.. ఇక ముందు మరెన్నో చేస్తాం.. ఇప్పటికైనా అభివృద్ధికి చేయాతనివ్వండి.. అంటూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత పార్టీ అనుచరులు జయహో.. అంటుంటే, ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక కామెంట్లు విసురుతున్నారు. ఇవి కొన్ని సందర్భాల్లో కట్టు తప్పి, వ్యక్తిగత విమర్శలకు దారితీస్తూ అదుపుతప్పుతున్నాయి.
అదుపు తప్పుతున్నాయ్..
విమర్శలకైనా.. ఆరోపణలకైనా.. ఒక హద్దు ఉంటుంది. ప్రత్యర్థిపై దాడి చేసే ముందు సంబంధిత అంశానికి సంబంధించిన ఆధారం కూడా ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చాలా మంది ఇష్టానుసారంగా కామెంట్లు, కౌంటర్లు, షేర్లు చేస్తున్నారు. ఇది కాస్తా విషమంగా మారుతుంది. మునిసిపాలిటీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో సోషల్ మీడియాలో మరింత రచ్చ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటి పై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి చట్ట ప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ చట్టాలతో...
- ఒకరి హక్కులకు భంగం కలిగించేలా ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తే బాధ్యుల పై ఐటీ చట్టం 66సీ, 66డీ, 67 కింద కేసులు నమోదు చేస్తారు.
- మహిళల పై వేధింపులకు దిగితే ఐపీసీ 509(మహిళల గౌరవానికి భంగం కలిగించడం), 354(ఏ,బీ,సీ,డీ) నిర్భయ చట్టాల కింద కటకటాల్లోకి పంపుతారు. అలాగే ఐపీసీ 292, 294 చట్టాల కింద కేసులు తప్పవు.
- కటకటాల పాలైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చిక్కులు తప్పవు. కార్పొరేట్, స్టాప్‌వేర్ లాంటి పెద్ద కంపెనీల కొలువుల్లోనూ ప్రవర్తన పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.
జాగ్రత్తగా ఉండాలి
సామాజిక మాద్యమాల ద్వారా అభ్యంతరకరమైన, మనోభావాలను దెబ్బతీసేలా, శాంతికి విఘాతం కలిగించేలా ఉన్న పోస్టులు చేయొద్దు. అలాగే వాటిని షేర్ చేయడం, కామెంట్ చేయవద్దు. ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాం. అలాగే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హద్దు మీరితే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలు పాటించి అందరూ ఉపయోగపడేవి షేర్ చేయాలి.
–నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment