మన దేశంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న స్త్రీల శాతం తక్కువే. 43% మంది స్త్రీలకు మాత్రమే ఇక్కడ మొబైల్ ఫోన్లు వున్నాయి. ఫోన్లు ఉపయోగిస్తున్న పురుషుల సంఖ్య దాదాపు ఇందుకు రెట్టింపు సంఖ్యలో (80%) వుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ర్వాండా సహా 18 దేశాలపై ‘లిర్న్‌ఆసియా’ (లెర్నింగ్ ఇనిషియేటివ్స్ ఆన్ రిఫార్మ్స్ ఫర్ నెట్‌వర్క్ ఎకానమీస్ ఆసియా) జరిపిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం – ఫోన్ల వాడకంలో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశ మహిళలు బాగా వెనకబడ్డారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఇంకా వెనకున్నారు. ఇంటర్‌నెట్ వాడకంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం (57%) మరింత ఎక్కువగా వుంది. అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు సర్వే విశ్లేషకులు. గ్రామీణులు (55%) కంటే పట్టణవాసులే ( 71%) ఎక్కువగా ఫోన్లు వాడుతున్నారని సర్వే వెల్లడించింది. మన దేశంలో మొత్తం 5000 మందిని ‘లిర్న్‌ఏషియా’ ఇంటర్వూ్య చేసింది. వీరిలో ఇంటర్‌నెట్ వాడకందార్లు 919 మంది మాత్రమే. సర్వే వెల్లడించిన ఆసక్తికర విషయాలు కొన్ని :
సోషల్ మీడియా వార్తలపై అపనమ్మకం
- దేశంలో నెట్ వాడకందార్లు 19% మాత్రమే. ఈ విషయంలో నైజీరియా, ఘనా, కెన్యా, కంబోడియా కంటే మనం వెనకబడ్డాం.
- 64% మందికి ఇంటర్‌నెట్ అంటే ఏమిటో తెలియదు. ఈ విషయంలో పాకిస్థాన్ (69%) బంగ్లాదేశ్ (67%)లు మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- నెట్ గురించి తెలియని వారిలో స్త్రీలు (68%) గ్రామీణులే (68%) ఎక్కువ. స్మార్ట్ ఫోన్ వాడకందార్లలో 35% మందికి ఇంటర్‌నెట్ గురించి తెలియదు.
- సోషల్ మీడియా (27%) కోసం ఎక్కువ మంది నెట్ వాడుతున్నారు. వినోదం (16%) వార్తల (15%) కోసం నెట్‌తో అనుసంధానమవుతున్న వారు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
- మార్కెటింగ్, విద్యా సంబంధిత సమాచారం కోసం సోషల్ మీడియాలో వున్న స్త్రీల శాతం మన దగ్గర ఎక్కువే. పురుషులు మాత్రం ప్రధానం చాటింగ్ కోసమే సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.
- దేశంలో అత్యధికులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను విశ్వసించడం లేదు. ఆ వార్తల్ని నమ్మేవారు 29% మంది మాత్రమే.
- పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పోల్చుకుంటే మనవాళ్లకి ఈ – కామర్స్ గురించిన అవగాహన ఎక్కువే. అయితే, మొబైల్‌తో నగదు లావాదేవీలు జరుపుతున్నవారు 6% మంది మాత్రమే.
ఆన్‌లైన్ వేధింపులు..
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఆన్‌లైన్ వేధింపు బాధితులే. 15 – 65 వయస్కుల్లో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ (12%) కంటే భారత్‌లోనే ఎక్కువమంది (19%) వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా చేదు అనుభవాలు మూట గట్టుకుంటున్న వారిలో పట్టణవాసులతో (17%)తో పోల్చుకుంటే గ్రామీణులే (20%) ఎక్కువ. స్త్రీల (17%) కంటే పురుషులు (20%) మరింతగా వేధింపుల బారిన పడుతున్నారు. 38% మందికి వేధింపుల వెనుక కారణాలేమిటో తెలియదు. జండర్ / మతం / రాజకీయాలు వేధింపులకు కారణమని 20% మంది భావిస్తున్నారు. 7% మంది ఆన్‌లైన్ గేమింగ్ / 29% మంది చాటింగ్ సందర్భంలో వేధింపుల బారిన పడుతున్నారు. వెబ్‌సైట్లో చేసిన కామెంట్లు 16% మందిని చికాకుపరిచాయట!
వేధింపులకు గురైన వారిలో దాదాపు సగం మంది (48%) వాటిని అంతగా పట్టించుకోలేదని చెప్పారు. 28% మంది మాత్రం సంబంధిత వెబ్‌సైట్‌కు కేటాయించే సమయాన్ని తగ్గించేశారట. కొందరయితే (15%) సంబంధిత యాప్‌నే తొలగించేశారట. 5% మంది వేధించే వాళ్లతో సంబంధాలను కత్తిరించేసుకోవడం /æ కాంటాక్ట్‌ను బ్లాక్ చేసేయడం / సంబంధిత గ్రూప్ లేదా ఫోరమ్ నుంచి బయటకొచ్చేయడం ద్వారా తలనొప్పులు తగ్గించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment