ఏసీబీ చేతిలో కీలక ఫైళ్లు
- విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు
- ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోళ్లు ఫైళ్లు, ఆయిల్ లాగ్ బుక్‌లు స్వాధీనం
- ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్
విజయవాడ : ప్రభుత్వాస్పత్రిలోని పలు కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫైళ్లతో పాటు, మందుల కొనుగోళ్లు, అంబులెన్స్ ఆయిల్ లాగ్‌బుక్స్‌ను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కాగా హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు చెందిన ఐదు బృందాల ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి బుధవారం వేకువ జాము వరకూ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు.
వారి తనిఖీల్లో పలులోపాలతో పాటు, సందేహాలున్న ఫైళ్లను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లి బుధవారం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వారికి ఎక్కడైనా అనుమానం వస్తే ప్రభుత్వాస్పత్రిలోని సంబంధిత సిబ్బందికి ఫోన్ చేసి వివరాలు అడగటంతో పాటు, మరింత సమాచారం కోసం ఇతర ఫైళ్లు కూడా తమకు అందజేయాలని కోరుతున్నారు.
అలా పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన అభివృద్ధి నిధుల నుంచి ఆస్పత్రికి ఇచ్చిన రూ.20లక్షలకు సంబంధించి ఖర్చు వివరాల ఫైలు కావాలంటూ బుధవారం ఆస్పత్రి అధికారులను కోరినట్లు తెలిసింది. దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోర్ కమిటీ, ఆస్పత్రి డ్రగ్స్ పర్చేజింగ్ కమిటీ సభ్యుల వివరాలు కావాలని అడిగారని సమాచారం.
కొంత కాలంగా ఆయా కమిటీల సమావేశాలు నిర్వహించని విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, ఆ సభ్యులను సైతం విచారించి కారణాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి ఫైలును పరిశీలించడంతో పాటు, రోగులు కేస్ షీటులనూ ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.ఏసీబీ సిబ్బంది బుధవారం ఆస్పత్రికి వచ్చి డ్రగ్‌స్టోర్‌ను పరిశీలించి వారికి కావాల్సిన వివరాలు సేకరించారు.
ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్
ఎన్నడూ లేని విధంగా ఏసీబీకి చెందిన ఐదుగురు డీఎస్పీ స్థాయి అధికారులు , పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలు ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని ఫైళ్లను వారి వెంట తీసుకెళ్లడంతో ఏమి జరుగుతుందోనని అయోమయంలో ఉన్నారు. ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంటారనే పుకార్లు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.