తెలంగాణ రాష్ట్రంలో అంధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం మేధావులతో కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో అంధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం మేధావులతో కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్లగొండ అంధుల పాఠశాలను శుక్రవారం ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత ఎలంగందుల వరదారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
అంధుల పాఠశాలను కాలేజీగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని హామీనిచ్చారు. అంధ విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. పాఠశాల స్థితిగతులను స్వయంగా పరిశీలించి అవగతం చేసుకున్నామన్నారు. అనంతరం పాఠశాల నిర్వహణకు వరదారెడ్డి రూ.25వేల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, అల్గుబెల్లి పాపిరెడ్డి, దామోదర్‌రావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.