తిరుపతిని సుందరనగరంగా తీర్చిదిద్ది రుణం తీర్చుకుంటా
శ్రీసిటీ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు
తిరుపతి పరిసరాల్లో చెరువుల ఆధునికీకరణ
పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి
జన్మభూమి సభలో సీఎం చంద్రబాబునాయుడు
చిత్తూరు: హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తిచేసి జూన్ నాటికి చిత్తూరు, కుప్పం ప్రాంతాలకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రపంచస్థాయి వసతులతో తిరుపతి నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. తిరుమల ప్రపంచ ఆథ్యాత్మిక కేంద్రం కావడం వల్ల తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకాభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, ఏర్పేడు ప్రాంతాల్లోని వంద చెరువులను ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులు సైతం నెలకొల్పుతామన్నారు. సోమశిల-స్వర్ణముఖిని పూర్తిచేసి బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. శ్రీసిటీ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. తిరుపతిని హార్డ్‌వేర్ హబ్‌ను నెలకొల్పుతున్నామన్నారు. తెలుగు గంగ నీటిని తిరుపతికి తరలించింది తానేనన్నారు.
బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన జయ్‌కా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ కింద టౌన్‌షిప్‌ను ఏడీబీ ముందుకు వచ్చిందన్నారు. తిరుపతిని విజ్ఞాన కేంద్రం కూడా తీర్చిదిద్దుతామని బాబు చెప్పారు. ఇప్పటికే హైజర్, ఐఐటీలు వచ్చాయన్నారు. వావిలాల చెరువును అభివృద్ధి చేసి హైదరాబాద్ లోని బ్రహ్మనందరెడ్డి పార్కు కంటే మిన్నగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతిలో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి నగరంలో ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రగిరి కోటను సైతం మరింత అభివృద్ధిచేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో నీరు- చెట్టు పనుల ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో అన్ని చెరువులు నీటితో నిండాయన్నారు. వర్షం వచ్చే నాటికి 33 మీటర్ల లోతున్న భూగర్భజలాలు ప్రస్తుతం 10.9 మీటర్లకు చేరాయన్నారు.
దీనివల్ల 90 టీయంసీల నీళు పొదుపు చేసినట్లు అయ్యిందని, తద్వారా 9లక్షల ఎకరాలకు నీరందే అవకాశముందన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి పనులను పూర్తిచేసి జిల్లాలో కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీ లత తదితరులు పాల్గొన్నారు.
జూన్ నాటీకి హంద్రీ-నీవా నీళ్లు
Published Fri, Jan 8 2016 2:42 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement