సింహపురివాసులంతా ‘సమైక్య’మై గర్జించారు. 37 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న జిల్లా ప్రజలు గురువారం మరో అడుగు ముందుకేసి ‘సమైక్య సింహగర్జన’లో కదం తొక్కారు. సభ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది.
సాక్షి,నెల్లూరు: సింహపురివాసులంతా ‘సమైక్య’మై గర్జించారు. 37 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న జిల్లా ప్రజలు గురువారం మరో అడుగు ముందుకేసి ‘సమైక్య సింహగర్జన’లో కదం తొక్కారు. సభ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు మొత్తంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సమైక్య నినాదాలతో సభ జరిగిన ఏసీసుబ్బారెడ్డి స్టేడియం హోరెత్తింది. విభజన ప్రకటనను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజితులను చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్య సింహగర్జన సభ ఊహించిన దానికంటే మిన్నగా విజయవంతమైంది. ఇదిలా ఉండగా జిల్లాలో సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు కొనసాగించారు.ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సమైక్యవాదులు, ఉద్యోగులు, సింహపురి లక్ష గళ గర్జనకు తరలివచ్చారు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి.
సీతారాంపురంలో ఉద్యోగ జేఏసీ నిర్వహిస్తున్న దీక్షలో వికలాంగులు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్‌లో కేసీఆర్‌ను వలవేసి పట్టుకున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. సోనియా శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, విచిత్ర వేషధారణతో నృత్యాలను ప్రదర్శిం చారు. మానవహారం, రాస్తారోకో చేశారు. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నెల్లూరులో జరిగిన సింహగర్జనకు భారీగా తరలి వచ్చారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తులు నిరాహారదీక్ష చేపట్టారు. సింహగర్జనకు గూడూరు నుంచి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చారు. చిట్టమూరులో మోటారుసైకిళ్ల ర్యాలీ, మల్లాంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
నెల్లూరులో జరిగిన సింహపురి సింహగర్జనకు సూళ్లూరుపేట నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది వచ్చారు. పట్టణంలో పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ఆంధ్ర రాష్ర్ట విభజనతో అన్నీ కష్టాలే.. అందరికీ నష్టాలే’ అనే శీర్షికన రాసిన కరపత్రాన్ని జేఏసీ కన్వీనర్ వాకిచర్ల శాంతారామ్ ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో విశ్రాంత ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. సింహగర్జనకు వెంకటగిరి తహశీల్దార్ ఆధ్వర్యంలో 20 వాహనాల్లో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, కార్మికులు తరలి వచ్చారు.