సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శుల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) పేరిట నిబంధనలు తుంగలో తొక్కి మినిస్టీరియల్ ఉద్యోగులను నియమించడం దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్న ఉద్యోగులు కోరుకున్న చోట పోస్టింగ్‌లు కొట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలపై కన్నేసిన కొందరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగులు తాము కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ‘ముడుపులు’ ముట్టజెప్పారని ఆ శాఖలోని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా నియమితులైన ఉద్యోగులు.. వారు పనిచేసే కా ర్యాలయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎలా నియమించారు? వారు ఎలా విధులు నిర్వహిస్తారనేది అర్థం కావడం లేదు. వారి రాకపోకలకే సమయం సరి పోతోంది. గ్రామ పంచాయతీని బట్టి ధరను నిర్ణయించి ఈవో, కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు అప్పగిం చేందుకు బాగానే దండుకున్నారన్నా ప్రచారం ఉంది. ఈ విషయమై ఆ శాఖలోని ఉద్యోగులు బాహాటంగా చర్చించుకోవడం వివాదాలకు కారణమవుతోంది.
మనోడైతే మేజరే..
ఈవో, కార్యదర్శుల నియామకాల వివాదం ఉధృతంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత కార్యదర్శు ల కొరత పేరిట ఆ శాఖ ఉన్నతాధికారులు పూర్తి అదన పు బాధ్యతలు ఇస్తూ ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయడంతోపాటు నెలనెల ‘మామూళ్ల’ ఒప్పందం చేసుకున్న ట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు డివిజనల్ పంచాయతీ అధికారులు, డీపీవో కార్యాలయంలో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగిన సీనియర్ కార్యదర్శులు రాయబారం చేసినట్లు విమర్శలున్నాయి. పంచాయతీ ఉన్నతాధికారులకు విధేయులుగా ఉండే డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాల జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఒక్కొక్కరికి రెండు, మూడేసి పంచాయతీల కు ఈవో, కార్యదర్శులుగా నియమించడం వివాదాస్ప దం అవుతోంది. అవకాశంరాని కార్యదర్శులు, సీనియ ర్లు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. నిబంధనల కు విరుద్ధంగా మినిస్టీరియల్ ఉద్యోగులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖాళీల భర్తీకే పంచాయతీలకు అదనపు కార్యదర్శులు
ఈవో కమ్ కార్యదర్శుల నియామకంలో అక్రమాలు, అవకతవకలు లేవు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలకు దాదాపు 600 పైచిలుకు పంచాయతీలకు కార్యదర్శులు లేరు. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడటంతో అభివృద్ధి కార్యకలాపాలు కుంటుపడకుండా ఉండేందుకు మాత్రమే వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులకు ఈవో కమ్ కార్యదర్శులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియామకాలు చేయడం జరిగింది.
- కె.పోచయ్య, డీపీవో, ఆదిలాబాద్
వివాదాస్పదంగా నియామకాలు..
- చెన్నూరు గ్రామ పంచాయతీ ఎల్‌డీసీ రాజ్‌కుమార్‌ను 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంకిడి పంచాయతీ కార్యదర్శిగా నియమించారు.
- మంచిర్యాల పరిధిలోని నస్పూరు మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న శ్రీపతిబాబును 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామ పంచాయతీ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీపతిబాబు నస్పూర్‌తోపాటు హాజీపూర్, వేమనపల్లికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
- డీఎల్‌పీవో కార్యాలయంలో ఎల్‌డీసీగా ఉన్న ఉమర్‌కు ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ కార్యదర్శిగా ఇచ్చారు.
- ఆదిలాబాద్ డీఎల్‌పీవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సత్యానందస్వామిని ఇచ్చోడ మేజర్ పంచాయతీ ఈవో, ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించారు.
- ఉట్నూర్ బిల్‌కలెక్టర్ మసూద్‌ను లక్కారం కార్యదర్శిగా నియమించారు.
- మంచిర్యాల ఈవోఆర్‌డీ శంకర్ కాసిపేట ఇన్‌చార్జి ఈవోఆర్‌డీగా, కాసిపేట, ముత్యంపల్లి ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శిగా, నెన్నెల ఇన్‌చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తుండటం వివాదాస్పదం అవుతోంది.
- డిసెంబర్ 31న బాసర మేజర్ పంచాయతీ కార్యదర్శి పదవీవిరమణ చేయగా ఆయన స్థానంలో ని ర్మల్ డీఎల్‌పీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌కు బాసర, ముథోల్ అప్పగించారు.
- ఇలా కార్యదర్శుల కొరతను ఆసరాగా చేసుకుని ఖాళీల భర్తీ పేరిట ఇష్టారాజ్యంగా జూనియర్ అసిస్టెంట్లను ఈవో కమ్ కార్యదర్శులుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు..
పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీలకు కార్యదర్శులుగా గ్రేడ్-1 వాళ్లను నియమించాలి. అలా కాకుండా గ్రేడ్-4 వాళ్లను నియమించారు. జూనియర్ అసిస్టెంట్లను పంచాయతీ కార్యదర్శులుగా నియమించి వివాదాలకు అధికారులు తెరతీశారు. ఎక్స్‌టెన్షన్ స్టాఫ్ కిందకు వచ్చే ఈవోఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులకే మిగతా పంచాయతీ కార్యదర్శులుగా నియమించా లి. మినిస్టీరియల్ స్టాఫ్‌ను, అందులో డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇవ్వకూడదు. ఈవో కమ్ కార్యదర్శులను నియమించాలంటే ఆయా మండలాల ఎంపీడీవోలు ప్రతిపాదనలు ఇవ్వాలి. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా అధికారులు వాస్తవాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా కేవలం ఖాళీల భర్తీ పేరిట నిబంధనలకు వక్రభాష్యం చెప్పడంపై ఆరోపణలు వస్తున్నాయి.