ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదినారాయణ
► గొర్రెలు పోగొట్టాడని యజమాని చిత్రహింసలు
► ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు హింసించి, మర్మాంగంపై కొట్టి.. నాలుకపై గాట్లు పెట్టిన యజమాని
► బాలుడి పరిస్థితి చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు
ధర్మవరం అర్బన్: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన గొర్రెలు మేపే బాలుడి పట్ల అతని యజమాని అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. తనవద్ద పనికి ఉంటున్న సమయంలో గొర్రెలు పోగొట్టాడనే నెపంతో బాలుడిని గదిలో నిర్బంధించి మర్మాంగంపై కొట్టి.. కర్రతో చావబాది, నాలుకపై కొడవలితో గాట్లు పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు.
బాధితుడి తల్లిదండ్రులు నాగమ్మ, ముత్యాలప్ప కథనం మేరకు.. మేడాపురానికి చెందిన చెందిన మల్లి అనే వ్యక్తి వద్ద ముత్యాలప్ప రూ.30 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ అప్పు తీర్చడానికి తమ కుమారుడు ఆదినారాయణ (16) చదువు మాన్పించి మల్లి వద్ద గొర్రెలు మేపేందుకు పెట్టాడు. ఆ బాలుడు గత ఏడాది పదో తరగతిలో 8.5 పాయింట్లతో పాసయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాలుడు ఐదు నెలలపాటు గొర్రెలను మేపాడు. దీంతో అప్పులో రూ. 15 వేలు పోగా, మిగతా నగదును ఆ బాలుడి తల్లిదండ్రులు శనివారం యజమానికి చెల్లించారు. తమ కుమారుడిని వదిలిపెట్టాలని కోరగా.. ఐదు గొర్రెలు పోగొట్టినందున మరికొన్ని రోజులు తమ వద్దే పనిలో ఉంచుకుంటామని యజమాని చెప్పాడు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు వెనక్కి వచ్చారు. వారు వెళ్లిన తర్వాత యజమాని మల్లి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గదిలో బాలుడిని బందించి విచక్షణా రహితంగా కొట్టాడు.
ఆదివారం సాయంత్రం ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రాత్రి ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడు ఆదినారాయణ కాళ్లు, చేతులు వాపులు రావడంతోపాటు నాలుకపై కొడవలి గాట్లు పడటంతో మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. బాలుని తల్లిదండ్రుల నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి చెన్నేకొత్తపల్లి పోలీసులకు సమాచారాన్ని అందించారు.