సాక్షి, నల్లగొండ : ‘‘ప్రగతి ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు. సమష్టి కృషి అవసరం. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి పొందిన విజయాలతో సంతృప్తి పడకుండా ప్రతి పేదవాడి కన్నీటిని తుడిపివేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఆదివారం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ రామ రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెడ్‌ల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగిస్తూ.... ప్రతి నిరుపేద కన్నీటిని దూరం చేసినప్పుడే అసలైన స్వాతంత్య్రమని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే ఇది సాధ్యమని చెప్పారు. సంకుచితత్వం, స్వార్ధాన్ని వదిలేసి బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్ ఎంతో దూరంలో లేదని, అందరూ కష్టపడితే ఇది సాధ్యమని చెప్పారు. ఫలితంగా భారతావనిని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాల తీరు, ప్రగతి గురించి వివరించారు.
అన్నదాతల అభివృద్ధికి...
‘‘అన్ని రకాలుగా రైతులు అభివృద్ధి చెందడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఖరీఫ్‌లో రూ.1011.80 కోట్ల పంట రుణాల లక్ష్యానికిగాను... రూ.1129.84 కోట్ల రుణాలు అందజే శాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత రబీల సీజన్‌లో అన్నదాతలకు ఉదారం గా రుణాలు అందజేయాలి. వడ్డీలేని రుణాల కింద 2.74 లక్షల మంది రైతులకు రూ.28.15 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు నష్టం జరిగిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తాం’’ అని చెప్పారు.
సాగుకు పెద్దపీట...
పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి సాగుకు అవకాశం పెరిగిందన్నారు. పులిచింతల ముంపు గ్రామాల బాధితులకు సహాయ, పునరావాస చ ర్యలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నామని, కరువు పీడిత ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు అందజేసేందుకు ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు రూ.3,774 కోట్లు ఖర్చుచేశామన్నారు. అదేవిధంగా జేబీఐసీ పథకం కింద రూ.39.80 కోట్ల వ్యయంతో డిండి, ఆసిఫ్‌నహర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. ఇప్పటివరకు రూ.25.21 కోట్ల ఖర్చు చేసినట్టు తెలిపారు.
నేతన్నలకు అండదండగా...
చేనేతలను ఆదుకునేందుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. 22 వేల చేనేత కుటుంబాల జీవనోపాధులకు భరోసా కల్పించాల్సిన బాధ్యతతో రూ.3.92 కోట్లతో 1025 మంది చేనేతలకు రుణ కార్డుల ఆధారంగా ఆర్థికంగా తోడ్పాటు అందించినట్టు చెప్పారు. అంతేగాక మరో పదివేల మందికిపైగా వృద్ధాప్య పింఛన్లు, బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
అన్ని రంగాల్లో మహిళలను..
‘‘మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా విరివిగా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఏడాది 22,503 సంఘాలకుగాను.. రూ.440.82 కోట్ల రుణాల లక్ష్యానికిగాను.. 16,721 సంఘాలకు రూ.354.5 కోట్ల రుణాలు అందజేశాం. బంగారుతల్లి పథకం కింద అర్హులైన 8,355 మంది ఆడ శిశువులను నమోదు చేసి ముందంజలో ఉన్నాం’’ అని వివరించారు.
‘పది’లంగా ఉండేందుకు..
పదో తరగతిలో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. బడిబయట ఉన్న ఐదు నుంచి 14 సంవత్సరాలలోపు మూడు వేల మంది పిల్లలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరిని వచ్చేనెల 10వ తేదీ వరకు బడిలో చేర్పించేందుకు బృహత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
తల్లీబిడ్డల సంరక్షణకు....
మాతాశిశు మరణాలు తగ్గించడం, పోషక విలువలు పెంచడం, ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిపే లక్ష్యంతో ఆయా శాఖలను సమన్వయ పరిచి ‘మార్పు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్ష పథకాల ద్వారా ప్రతి తల్లీ శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు....
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, 74,869 మంది మందికి ఈ ఏడాది నూతనంగా ఓటు హక్కు కల్పించినట్టు తెలిపారు.
భావితరాల భవిష్యత్ కోసం...
ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల జవాబుదారీతనాన్ని పెంపొంది స్తున్నామన్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజల భాగస్వామ్యంతో నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, రక్షిత తాగునీరు, ప్రజారోగ్యం, పౌష్టికాహారం అందజేత, స్త్రీ వివక్ష రూపుమాపడం, బాలికా శిశు సంరక్షణ మొదలైన అంశాలపై ప్రగతి సాధించేం దుకు నిత్యం పాటుపడుతున్నామని వివరించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జేసీ హరి జవహర్‌లాల్, డీసీసీబీ ఇన్‌చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, స్వాతంత్య్ర సమరయోధుడు నర్రా రాఘవరెడ్డి, జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ వెంకట్రావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు సుధాకర్, కోటేశ్వరరావు, డీఈఓ జగదీష్, మాడా పీఓ సర్వేశ్వర్‌రెడ్డి, బీసీ, ఎస్పీ కార్పొరేషన్ ఈడీలు గంగాధర్, శ్రీధర్, డ్వామా అదనపు పీడీ నర్సింహులు, డీఎంహెచ్‌ఓ ఆమోస్, డీఆర్‌ఓ అంజయ్య, ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
సమష్టి కృషితో ప్రగతి బాట
Published Mon, Jan 27 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement