తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక
- నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు కేటాయింపు
- త్వరలో నియోజక వర్గాలవారీగా సమీక్షలు
- తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం
- పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ నిధులను ఎక్కువగా కేటాయిస్తానని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లెకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఈ విషయంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించనున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించనున్నట్టు చెప్పారు.ముఖ్యంగా కండలేరు నదీజలాలను తీసుకురావడానికి నిధులు కొరత ఉందన్నారు. జిల్లాలో అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నామని చెప్పారు.
రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మదనపల్లె, పుంగనూరు పట్టణాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొంగదార్లలో కౌన్సిలర్లను కొనుగోలుచేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి కౌన్సిలర్లను కొనుగోలుచేస్తే ఆ డబ్బును సంపాదించేందుకు అవినీతికి పాల్పడతారే తప్ప అభివృద్ధి ఏంచేస్తారని ప్రశ్నించారు.
ఎంపీ వెంట మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షమీమ్ అస్లాం, మైనారిటీల నాయకుడు బాబ్‌జాన్, కౌన్సిలర్ జింకా వెంకటా చలపతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్‌ఏ కరీముల్లా, రాష్ర్ట బీసీ నాయకులు పాల్ బాలజీ, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోటూరి ఈశ్వర్, భువనేశ్వరి సత్య, కత్తి కృష్ణమూర్తి, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.