రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసు
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : ఎలాంటి తప్పు లేకపోయినా.. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం నెల్లూరు జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా ‘సాక్షి’తో మాట్లాడారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఎలాంటి సంఘటనలు జరగకపోయినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో ఫిర్యాదు చేయించారన్నారు. ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్న సంఘటనపై మేనేజర్ ఎంపీకి క్షమాపణలు చెప్పారన్నారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏ తప్పూ చేయని ఎంపీపైనే ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారన్నారు.
ఇదిలా ఉండగా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు విమానంలో సీటు కేటాయింపు విషయంలో ఎయిర్ హోస్టెస్‌ను అంతుచూస్తానంటూ బెదిరించిన సంఘటనపై ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ద్వారా ఒత్తిడి చేయించి ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును తొక్కి పెట్టేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలను ఏ విధంగా గౌరవిస్తున్నారో ఈ సంఘటనను బట్టి తెలుస్తోందన్నారు. ఏమీ జరగకపోయినా రాజకీయ కక్షసాధింపుతో మిథున్‌రెడ్డిపై కేసు న మోదు చేశారని, స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో మాత్రం ఒక మహిళకు తీవ్ర అన్యాయం జరిగినా పట్టించుకోలేదన్నారు. ఇదేం న్యాయమని ఆయన ప్రశ్నించారు.